
ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు ఆరు సూత్రాలతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం మందుల తయారీ, అందుబాటులో మందుల్ని ఉంచడం, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం అందించడం, తీవ్ర వ్యాధులతో సతమతం అవుతున్న వారికి ప్రతినెల పెన్షన్, కొత్తగా 108, 104 వాహనాలు కొనుగోలు, ఆస్పత్రుల అభివృద్ధి ద్వారా ఆరోగ్య రంగాన్ని బలోపేతానికి మార్గదర్శక ప్రణాళికను సీఎం జగన్ సూచించారు.
సాక్షి, అమరావతి : ఆరోగ్యశ్రీ పథకం కింద నవంబర్ 1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లోని 150 ఆస్పత్రుల్లో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియ జనవరిలో మొదలు పెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై శుక్రవారం సీఎం సమీక్ష నిర్వహించారు. కంటివెలుగు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలు, మాతా శిశుమరణాల నివారణ వంటి కీలక అంశాలపై సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు.
అనారోగ్యంతో ఉన్నవారికి పెన్షన్‌లు..
ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు ఆరు సూత్రాలతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం మందుల తయారీ, అందుబాటులో మందుల్ని ఉంచడం, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం అందించడం, తీవ్ర వ్యాధులతో సతమతం అవుతున్న వారికి ప్రతినెల పెన్షన్, కొత్తగా 108, 104 వాహనాలు కొనుగోలు, ఆస్పత్రుల అభివృద్ధి ద్వారా ఆరోగ్య రంగాన్ని బలోపేతానికి మార్గదర్శక ప్రణాళికను సీఎం జగన్ సూచించారు. డిసెంబర్ 1 నుంచి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి కోలుకునేంత వరకూ నెలకు రూ. 5వేలు లేదా రోజుకు రూ. 225 ఆర్థిక సహాయం అందించాలని.. తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారితోపాటు తలసేమియా, హీమోఫీలియా, సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10 వేల ఆర్థికం సాయం వర్తింపజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
రూ. 5వేల కేటగిరిలో మరో నాలుగు వ్యాధులు చేర్చాలని ముఖ్యమంత్రి సూచించారు. బోధనాస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక సిద్ధం చేయాలని, ఆస్పత్రుల్లో మందులకు కొరత లేకుండా, నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మందులు దొరకడం లేదన్న ఫిర్యాదు ఎక్కడా రాకూడదని స్పష్టం చేశారు. హెల్త్ సబ్‌సెంటర్లలో అభివృద్ది కార్యక్రమాలు కూడా వచ్చే మే నెల నుంచి ప్రారంభమవ్వాలని, ఆరోగ్యశ్రీలో డబుల్ కాంక్లియర్ ఇంప్లాంట్‌ను చేర్చాలని సీఎం జగన్ వెల్లడించారు. డిసెంబర్ 21న ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, ఆస్పత్రుల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్లకు రూ.16వేలు పెంచేలా వెంటనే జీవో జారీచేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని కళాశాల విద్యార్థులకు వర్తింప చేయాలని, నెలరోజుల్లో వారికి కూడా పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. కంటి వెలుగు కార్యక్రమం మాదిరిగానే ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, పాఠశాల విద్యార్ధుల నుంచి ఈ కార్యక్రమం మొదలు పెట్టనున్నట్టు చెప్పారు.
‘పక్షవాతంతో వీల్‌ఛైర్‌కు పరిమితమైనవారికి.. రెండు కాళ్లు లేక చేతులు లేని లేదా పనిచేయని స్థితిలో ఉన్నవారికి.. కండరాల క్షీణతతో పనిచేయని పరిస్థితిలో ఉన్నవారికి రూ.5వేల పెన్షన్ వర్తింపు చేయాలి. వీరికి జనవరి 1 నుంచి ఈ పెన్షన్ అమలు చేయాలి. డెంగీ, సీజనల్ వ్యాధులకు ఇందులో చోటు కల్పించాలి. గిరిజన ప్రాంతాల్లో బైకుల ద్వారా వైద్యసేవలను మారుమూల ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురావాలి. ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. అన్ని కమ్యూనిటీ ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల అభివృద్ది కార్యక్రమాలు వచ్చే డిసెంబర్ 2019 నుంచి డిసెంబర్ 2020 నాటికి పూర్తి చేయాలి’ అని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.
అన్ని జాతీయ రహదారుల్లో మద్యం దుకాణాలను తొలగించాలని సీఎం ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారు ఆస్పత్రికి వస్తే డబ్బుకోసం వేచి చూడాల్సిన అవసరం లేదనే రీతిలో తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నుంచే కొంత మొత్తాన్ని దీనికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీనికి విధివిధానాలు ఖరారు చేయాలని, త్వరలోనే ఓ కార్యక్రమాన్ని ప్రకటించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు.