
ప్రకృతి వరం.. అభివృద్ధికి దూరం
పోలవరం మండలం పట్టిసీమ శైవ క్షేత్రాన్ని ప్రకృతి ప్రసాదించిన వరంగా భక్తులు భావిస్తారు. పరమ పావనిగా ప్రసిద్ధికెక్కిన
పోలవరం :పోలవరం మండలం పట్టిసీమ శైవ క్షేత్రాన్ని ప్రకృతి ప్రసాదించిన వరంగా భక్తులు భావిస్తారు. పరమ పావనిగా ప్రసిద్ధికెక్కిన గోదావరి నది మధ్య ఈ పురాతన క్షేత్రం సహజసిద్ధంగా వెలసింది. ఆధ్యాత్మికతతోపాటు ఆహ్లాదాన్ని పంచే ఈ క్షేత్రంలో శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానమాచరించిన అనంతరం దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం. మహాశివరాత్రి రోజున ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం, రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి రావడం ఇక్కడి విశిష్టత. గోదావరి పుష్కరాల సమయంలోనూ భక్తులు ఈ క్షేత్రానికి భారీగా తరలివస్తారు. పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ఈ క్షేత్రంలో వివిధ పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.42 లక్షలు మంజూరు చేసింది. మెట్లకు మరమ్మతులు, ధ్వజస్తంభాల ఏర్పాటు, ప్రాకార మండపం మరమ్మతులకు ఈ నిధులను వెచ్చించాల్సి ఉంది. పనులు చేపట్టేందుకు రెండుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. దీంతో మూడోసారి టెండర్లు పిలిచారు. దీనికీ ఈ నెల 12వ తేదీతో గడువు ముగుస్తోంది. శివక్షేత్రం గోదావరి నది మధ్యన ఉండటంతో రవాణా ఇబ్బందుల దృష్ట్యా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదని అధికారులు చెబుతున్నారు.
ఆస్తులెన్ని ఉన్నా.. అభివృద్ధి సున్నా
పురాతన కాలంనాటి ఈ క్షేత్రం తగిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. ఈ క్షేత్రానికి 191 ఎకరాల భూమి ఉంది. ఇందులో 65 ఎకరాలను ధూప, దీప, నైవేద్యాల కోసం అర్చకులకు ఇచ్చారు. మిగిలిన 126 ఎకరాల భూమిపై ఏడాదికి రూ.6 లక్షలు మాత్రమే ఆదాయం వస్తోందని ఆలయ మేనేజర్ నాళం సూర్యచంద్రరావు తెలిపారు. దీంతోపాటు మహాశివరాత్రి సందర్భంగా వచ్చే ఆదాయంతోనే ఆలయ నిర్వహణ చేస్తున్నామన్నారు. ఇదిలావుండగా అర్చకులకు ఈ క్షేత్రంపై నివాసాలు కూడా లేవు. భక్తులకు సరిపడా మరుగుదొడ్లు సైతం లేవు. రెండేళ్ల క్రితం ఇదే క్షేత్రంలో గల శ్రీ భావన్నారాయణస్వామి ఆలయ ధ్వజ స్తంభం కూలిపోగా, 10 నెలల క్రితం శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయ ధ్వజ స్తంభం నేలకొరిగింది. వీటిని నేటికీ పునరుద్ధరించలేదు. గత ఏడాది అప్పటి జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఈ ఆలయాన్ని దర్శించి క్షేత్రంలో సీసీ రోడ్డు నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. కాంక్రీట్ వేసి వదిలేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదు.
క్షేత్ర విశిష్టత ఇదీ
పంచ శివక్షేత్రాల్లో పట్టిసీమ క్షేత్రం ఒకటి. దీనిని పట్టిసాచలం, దేవకోటాద్రి, కీలాద్రి అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రంలో వీరభద్రుడు లింగాకారం ధరించి స్వయంభువుడై వెలిశాడని పురాణ ప్రతీతి. దీనికి నిదర్శనంగా లింగాకారం చుట్టు బాహువులు, హస్తం గుర్తులు నేటికీ దర్శనమిస్తున్నాయి. ఈ క్షేత్రంలో భూనీలా సమేతుడైన మహావిష్ణువు శ్రీభావన్నారాయణస్వామి రూపంలో క్షేత్ర పాలకునిగా ఉన్నారు. హరిహరాదులు ఈ క్షేత్రంలో ఉండటంతో ప్రముఖ క్షేత్రంగా భాసిల్లుతోంది. స్కంధపురాణంలో పేర్కొన్న ప్రకారం శ్రీకనకదుర్గ, మహిషాసురమర్ధని అమ్మవార్లు గ్రామ దేవతలు. సీతారామస్వామి, ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, కుమారస్వామి, అనిస్త్రీ, పునిస్త్రీలు ఇదే క్షేత్రంలో కొలువై ఉన్నారు.