ట్యాబ్‌లో యువకులు ఫీడ్ చేసిన ఓటరు నంబర్లు, పేర్ల వివరాలు
సాక్షి, తిరుపతి: సర్వే పేరుతో సంచరిస్తున్న ఓట్ల దొంగలను అడ్డుకునేవారిపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెంలో సర్వే పేరుతో ఓట్లను తొలగిస్తున్న వారిని పట్టించిన గ్రామస్తుల ఇళ్లలోకి శుక్రవారం అర్థరాత్రి పోలీసులు చొరబడి తలుపులు పగలకొట్టి దాడులకు దిగారు. నకిలీ సర్వే బృందాన్ని పట్టించిన యువకుడిని బట్టలు ఊడదీసి దారుణంగా చితకబాదారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వృద్ధులైన బాధితుడి తల్లిదండ్రులను సైతం కొట్టారు. అనంతరం ఆ యువకుడిని అర్థనగ్నంగానే జీపులోకి గెంటేసి కొడుతూ రహస్య ప్రాంతానికి తరలించి వేధించారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సమీప గ్రామాలకు చెందిన వారు వందల సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో పోలీసులు నిష్క్రమించారు. అనంతరం పోలీసుల దెబ్బలతో స్పృహ కోల్పోయిన యువకుడి తల్లిదండ్రులను గ్రామస్థులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం
ఓట్ల దొంగలను అడ్డుకున్న గ్రామస్థులను పోలీసులు అరెస్టు చేసి హింసించడం పట్ల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీవ్ర నిరసన తెలిపారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులతో కలసి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట ఉదయం ధర్నాకు దిగారు. దీంతో దిగివచ్చిన పోలీసులు హడావుడిగా ముగ్గురు బాధిత యువకులను పాకాల జూనియర్ సివిల్ జడ్జి ఎదుట కోర్టులో హాజరు పరిచారు. పోలీసుల దాష్టీకాన్ని ఈ సందర్భంగా బాధితులు న్యాయమూర్తికి కన్నీళ్లతో విన్నవించారు. ‘తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా ఇళ్లపై దాడులు చేస్తారా?’ అంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి వెంటనే వారిని వదిలేయాలని ఆదేశించారు. దీంతో కోర్టు ప్రాంగణంలోనే వారిని వదిలేసి పోలీసులు వెళ్లిపోయారు.
స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి.. వేణుగోపాల్‌రెడ్డి ఇంట్లో విరిగిన తలుపు, చెల్లాచెదరుగా వస్తువులు
ఆ ట్యాబ్‌లో ఏముంది?
‘గ్రామస్థులు స్వాధీనం చేసుకుని ఎన్నికల కమిషన్‌కు పంపిన ట్యాబ్‌లో ఏముంది? పోలీసులు అర్థరాత్రి వేళ ఎందుకంత హడావుడిగా చొరబడ్డారు? ఇళ్ల తలుపులను బద్ధలుగొట్టి ట్యాబ్ కోసం బీభత్సం సృష్టించేంత అవసరం ఏం వచ్చింది?..’ అనే పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నియోజకవర్గంలో తొలగించిన 14 వేల ఓట్లకు పైగా దొంగ దరఖాస్తుల గుట్టు అందులో ఉందా? అందుకేనా పోలీసులు అంత ఆదుర్దాగా వచ్చారు? వారికి జిల్లా స్థాయి పోలీస్ బాస్ వంతపాడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఎన్నికల సంఘం ఈ ట్యాబ్ గుట్టు విప్పితే ఓట్ల గల్లంతు వెనుక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఆ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి..
‘అధికార పార్టీకి కార్యకర్తల మాదిరిగా పని చేస్తున్న కొందరు పోలీస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. లేదంటే ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసే అవకాశం ఉండదు. ఓట్ల దొంగలను వదిలేసి పట్టించిన వారిపై దౌర్జన్యం చేసి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. కోర్టు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులను వదలి పెట్టాలని ఆదేశించింది.
అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు పోలీసుల తీరు పోలీస్ వ్యవస్థకే మచ్చ లాంటిది. వీటన్నింటిని కేంద్ర ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి వివక్ష చూపిస్తున్న పోలీస్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. మా కార్యకర్తలను వేధించాలని ప్రయత్నిస్తే ప్రజా పోరాటాలకు సిద్ధమవుతాం. న్యాయస్థానం, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తాం’
– చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (చంద్రగిరి ఎమ్మెల్యే)
Comments
Please login to add a commentAdd a comment