
లెక్చరర్ నివాసంలో పోలీసులు ముమ్మర తనిఖీలు
ఏలూరు: సీఆర్ రెడ్డి కళాశాల లెక్చరర్ గౌస్మొహిద్దీన్ నివాసంలో గత రాత్రి నుంచి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో రియల్ ఎస్టేట్కు వ్యాపారానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన నివాసంలో గురువారం ఉదయం కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఓ నిరుద్యోగి నుంచి లెక్చరర్ గౌస్మొహిద్దీన్ రూ. 15 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఎస్సై ఉద్యోగం ఇప్పించకపోవడంతో సదరు నిరుద్యోగి గౌస్మొహిద్దీన్పై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. ఆ క్రమంలో తీసుకున్న మొత్తం నగదులో రూ. 3 లక్షలు తిరిగి నిరుద్యోగికి ఇచ్చేశాడు. మిగత సొమ్ము కూడా ఇవ్వాలని నిరుద్యోగి డిమాండ్ చేశాడు. అందుకు గౌస్ ససేమిరా అనడంతో... సదరు నిరుద్యోగి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు సర్చ్ వారెంట్తో గౌస్ నివాసాన్ని తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అదికాక ఒంగోలు పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటవుతుందంటూ రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడినట్లు గౌస్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే సీనియర్ ఐపీఎస్ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. దీనిని అసరాగా చేసుకుని ఎస్ఐ, సీఐ బదిలీలు, ప్రమోషన్లలో గతంలో గౌస్ కీలక పాత్ర షోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఆర్ రెడ్డి కాలేజీలో గౌస్మొహిద్దీన్ పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా పని చేస్తున్నారు.