రోడ్డు ప్రమాదంలో అధ్యాపకుడి మృతి
రోడ్డు ప్రమాదంలో అధ్యాపకుడి మృతి
Published Mon, May 29 2017 11:38 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ప్రిన్సిపాల్‌కు తీవ్రగాయాలు
వేమగిరి హైవేపై ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు
కడియం (రాజమహేంద్రవరం రూరల్) : వేమగిరి తోట సమీపంలో హైవేపై సోమవారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో కొత్తపేట వీకేవీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఫిజిక్స్ అధ్యాపకుడు కోసూరి శ్రీనివాసరావు (56) అక్కడికక్కడే మృతి చెందారు. కాలేజీ ప్రిన్సిపాల్ సీఎల్ నాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరూ కారులో వస్తుండగా వేమగిరి వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని వీరి కారు ఢీకొట్టింది. పోలీసుల కథనం ప్రకారం రాజమహేంద్రవరం పీఅండ్‌టీ కాలనీకి చెందిన శ్రీనివాసరావు కొత్తపేట డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నారు. రోజూ రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద మోటారు సైకిల్‌ను పెట్టి బస్సులో కొత్తపేట వెళుతుంటారు. సోమవారం తిరిగి వచ్చేటప్పుడు రాజమహేంద్రవరం తిలక్ రోడ్డు ప్రాంతానికి చెందిన కాలేజీ ప్రిన్సిపాల్ నాయుడి కారులో బయలుదేరారు.
వెనుక సీట్లో కూర్చున్నారు...
ప్రిన్సిపాల్ నాయుడు కారు నడుపుతుండగా, అతడి పదేళ్ల కుమారుడు బాలు ముందు సీట్లో కూర్చున్నాడు. వెనుక సీట్లో ఎడమవైపున శ్రీనివాసరావు కూర్చున్నారు. లారీని బలంగా ఢీకొనడంతో కారు ముందుభాగం మొత్తం నుజ్జునుజ్జయింది. నాయుడు, బాలు కారులో ఇరుక్కుపోయారు. స్థానికులు పోలీస్‌లకు సమాచారం ఇచ్చి సహాయక చర్యలు చేపట్టారు. కారు ఎడమవైపు ముందు సీట్లో కూర్చున్న బాలు.. లారీ ఛాసిస్ ఎత్తు కంటే కారు ఎత్తు తక్కువగా ఉండడంతో నేరుగా లారీని ఢీకొట్టినప్పటికీ ప్రాణాపాయం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. లేకుంటే అతడికి కూడా పెను ప్రమాదం సంభవించేందని వివరించారు. వాహనాన్ని నడుపుతున్న నాయుడు కూడా కారులో ఇరుక్కుపోయారు. స్థానికులు వారిని బైటకు తీశారు. అప్పటికే శ్రీనివాసరావు మృతి చెందారు. 108 అంబులెన్స్‌లో నాయుడు, బాలును రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దక్షిణ మండలం డీఎస్పీ పి.నారాయణరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కడియం ఎస్సై కె.సురేష్‌బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా ప్రమాద ఘటన సమాచారాన్ని కాలేజీకి, వారి కుటుంబ సభ్యులకు పోలీసులు తెలియజేశారు. బాధితుల కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీటి పర్యవంతమయ్యారు.
రైల్వే ట్రాక్ దాటుతున్న యువకుడు...
అనపర్తి : స్థానిక బాలుర ఉన్నత పాఠశాల వైపున గల రైల్వే గేటు వద్ద సోమవారం ట్రాక్ దాటుతున్న యువకుడిని రైలు ఢీకొనడంతో అతడు దుర్మరణం చెందాడు. సామర్లకోట రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ డి.అప్పారావు కథనం ప్రకారం మండలంలోని పీరా రామచంద్రపురానికి చెందిన చాట్ల సురేష్‌బాబు (25) వస్తున్న రైలును గమనించక రైల్వే గేటు వద్ద ట్రాక్ దాటుతున్నాడు. దీంతో కాకినాడ-షిరిడీ ఎక్స్‌ప్రెస్ సురేష్‌బాబును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సురేష్ మృతదేహం ఛిద్రమైంది. ఈ ఘటనపై అనపర్తి రైల్వే సిబ్బంది సమాచారంతో çసంఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మండపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ తెలిపారు.
అనారోగ్యంతో గిరిజనుడు...
వీఆర్‌పురం (రంపచోడవరం) : కిడ్నీ సంబంధిత వ్యాధి బారిన పడిన గిరిజన యువకుడు బురకా శిరమయ్య (43) సోమవారం మృతి చెందాడు. అన్నవరం గ్రామానికి చెందిన శిరమయ్య కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. నాలుగు రోజుల క్రితం అతడు తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అతడి పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆదివారం అక్కడి నుంచి కాకినాడ జీజీహెచ్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు మృతి చెందాడు. సోమవారం మృతదేహాన్ని స్వగ్రామం అన్నవరం తీసుకువచ్చారు. చింతూరు ప్రభుత్వాస్పత్రిలో కిడ్నీకి సంబంధించిన డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసి ఉంటే భర్త బతికేవాడని మృతుడి భార్య చిన్నమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. మృతుడికి కుమారై, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Advertisement
Advertisement