పోలీసుల దొంగాట
నాలుగో సింహానికి తలవంపులు
వరుస ఘటనలతో దిగజారుతున్న ప్రతిష్ట
తాజాగా ముగ్గురు పోలీసుల అరెస్టు
అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు
దారి దోపిడీ వ్యవహారమే కారణం
విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ
క్రమశిక్షణకు మారుపేరుగా భావించే రక్షక భటులు.. భక్షకులుగా దిగజారిపోతున్నారు. కనిపించని నాలుగో సింహంగా కాలరెగరేసుకు తిరగాల్సిన పోలీసులు.. సమాజం ఎదుట దోషులుగా తల దించుకుంటున్నారు. లోకాన్ని ఆడించే డబ్బుకు దాసోహమంటూ చేయి చాస్తున్నారు. మొత్తంగా పోలీసు శాఖ ప్రతిష్ట మసకబారుతోంది. ఇటీవలి వరుస ఘటనలు జిల్లా పోలీసుల పరువును బజారున పడేశాయి. కుటుంబంలో ఎవరు తప్పు చేసినా యజమాని వైపు వేలెత్తి చూపడం సహజం. మరి పోలీసుల తప్పునకు ఎవరిని ప్రశ్నిద్దాం.
కర్నూలు : వరకట్న వేధింపుల కేసులో నిందితులను అరెస్టు చేయకుండా ఉండేందుకు మహిళా పీఎస్ ఎస్‌ఐ మద్దయ్య రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కగా.. హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎస్పీ సంతకం ఫోర్జరీతో రూ.22.50 లక్షలు వసూలు చేసిన ఏపీఎస్పీ రెండో పటాలం ఆర్‌ఎస్‌ఐ కృష్ణుడు కటకటాలపాలయ్యాడు. ఈ మరకలు చెరిగిపోక మునుపే ముగ్గురు పోలీసుల దోపిడీ వ్యవహారం ఆ శాఖను కుదిపేస్తోంది.
ఎమ్మిగనూరులో బాంబే జువెలర్స్ యజమాని అలీం ఫిర్యాదు మేరకు బెంగళూరులోని అల్సూర్ పోలీసులు ఆదోనికి చెందిన వన్‌టౌన్ కానిస్టేబుల్ జయన్న, ఏఆర్ కానిస్టేబుళ్లు శేఖర్, సత్యనారాయణలను ఆదివారం అరెస్టు చేసిన ఘటన సాటి పోలీసులను తలెత్తుకోలేకుండా చేస్తోంది. సత్యనారాయణ పోలీసు శాఖలోని మోటార్ ట్రాన్స్‌పోర్టు సెక్షన్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతని తండ్రి ఏపీఎస్పీలో ఆర్‌ఎస్‌ఐగా పని చేసి పదవీ విరమణ పొందారు.
1994లో పోలీసు శాఖలో విధుల్లో చేరిన సత్యనారాయణ ప్రస్తుతం పత్తికొండ సీఐ వద్ద డ్రైవర్‌గా ఉన్నాడు. మట్కా వ్యసనంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆయన.. ఆర్థిక ఇక్కట్ల నుంచి బయటపడేందుకు నేరాల బాట పట్టి పోలీసు శాఖకే కలంకం తీసుకొచ్చాడు. ఇక అరెస్టయిన మరో ఏఆర్ కానిస్టేబుల్ శేఖర్ 1994లో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి.. రెండేళ్ల క్రితం ఏఆర్‌కు డిప్యూటేషన్‌పై వచ్చాడు. వెల్దుర్తి మండలానికి చెందిన ఈయన ప్రస్తుతం కర్నూలులో నివాసం ఉంటున్నాడు.
కానిస్టేబుల్ జయన్న విషయానికొస్తే.. అనతికాలంలోనే డబ్బు సంపాదించాలనే ఆలోచన ఆయనను దారి తప్పించినట్లు తెలుస్తోంది. ఆదోని పట్టణాన్ని పట్టుకుని వేలాడుతున్న పోలీసుల విషయంలో ‘బాస్’ పట్టించుకోకపోవడం వల్లే ఈ తరహా ఘటనలకు కారణమవుతుందనే చర్చ జరుగుతోంది.
చంద్రబాబు కాన్వాయ్‌లో నిందితుల గుర్తింపు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మిగనూరు పర్యటన సందర్భంగా శేఖర్‌తో పాటు సత్యనారాయణ బందోబస్తు విధులకు హాజరయ్యారు. బాంబే జ్యువెలర్స్ యజమాని అలీం వారిద్దరినీ గుర్తించి బెంగళూరు పోలీసులకు సమాచారం చేరవేశారు. బెంగుళూరు పోలీసులు శనివారం రాత్రి ఎమ్మిగనూరుకు వచ్చి సత్యనారాయణతో పాటు శేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు ఆదోని పోలీసు క్వార్టర్స్‌లో నివాసముంటున్న జయన్నను కూడా అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు.
ఈ ఘటన జిల్లా పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలోనూ దొంగనోట్ల ముఠాతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఆదోని పట్టణానికి చెందిన ఓ సీఐ, ఇద్దరు ఎస్‌ఐలపై సస్పెన్షన్ వేటు పడింది. సివిల్ పంచాయితీలు చేస్తూ విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతూ ముగ్గురు కానిస్టేబుళ్లు శాఖాపరమైన చర్యలకు లోనయ్యారు. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న ఘటనల నేపథ్యంలోనైనా పోలీసు బాసు మేల్కొనకపోతే ఆ శాఖ పరువు మరింత దిగజారక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విచారణకు ఎస్పీ ఆదేశం
కర్ణాటకలో కర్నూలు పోలీసులు దారి దోపిడీకి పాల్పడిన ఘటనపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయిలో విచారించి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఏఆర్ అడిషనల్ ఎస్పీ రాధాకృష్ణకు సూచించారు. నేరం రుజువైతే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.