
అనంతపురం రైల్వేస్టేషన్‌లో మిస్‌ఫైర్
► ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్ల కాళ్లలోకి దూసుకెళ్లిన బుల్లెట్
అనంతపురం న్యూసిటీ: అనంతపురం రైల్వే స్టేషన్‌లో కానిస్టేబుల్ చేతిలోని కార్బన్ తుపాకీ మిస్‌ఫైర్ అయిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ టంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) హెడ్ కానిస్టేబుళ్లు(గుంతకల్లు) రామచంద్ర, రఫీ విధి నిర్వహణలో భాగంగా ఈ నెల 19న రాత్రి 12 గంటల సమయంలో హంపి ఎక్స్‌ప్రెస్‌లో అనంతపురం బయలుదేరారు.
అనంతపురంలో బుధవారం 1.35 గంటల సమయంలో అనంతపురం ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం వద్ద దిగారు. రైలు రన్నింగ్‌లో ఉండగానే ఓ వ్యక్తి పరుగెత్తుకుని వస్తూ హెడ్ కానిస్టేబుల్ రామచంద్రను తగులుతూ రైలెక్కి వెళ్లిపోయాడు. ఆ ప్రయాణికుడు వేగంగా తగలడంతో రామచంద్ర మరో హెడ్‌కానిస్టేబుల్‌ను తగలగా వీరిద్దరూ కింద పడ్డారు. రామచంద్ర చేతిలో ఉన్న కార్బన్ తుపాకీ కింద పడడంతో లాక్ ఓపెన్ అయ్యి క్షణాల్లో మిస్‌ఫైర్ జరిగింది. రామచంద్ర మోకాలు కింద భాగంలో బుల్లెట్ దూరి రఫీ అనే హెడ్‌కానిస్టేబుల్ తొడలోకి దూసుకెళ్లింది. దీంతో అక్కడే ఉన్న ప్రయాణికులు, సిబ్బంది జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. వారు బాధితులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు.