విలేకరుల సమావేశంలో మీసం మెలేస్తూ మాట్లాడుతున్న గోరంట్ల మాధవ్
అనంతపురం సెంట్రల్: శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలూ పనిచేసే పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడితే నాలుక కోస్తామని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని ఉద్దేశించి పోలీసు అధికారుల సంఘం నాయకులు హెచ్చరించారు. గురువారం అనంతపురంలోని పోలీసు అధికారుల సంఘం కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్, ప్రధాన కార్యదర్శి గోరంట్ల మాధవ్ విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రాజకీయ నాయకులు అదుపుతప్పి పోలీసు వ్యవస్థను ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతుండడం బాధాకరమన్నారు.
కొంతమంది రాజకీయ నేతలు పోలీసు వ్యవస్థను డిఫెన్స్‌లో పడేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇంత వరకూ సంయమనం పాటించామని.. ఇకనుంచి ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పోలీసులపై మాట్లాడితే కొమ్ములొస్తాయని భావిస్తే సహించబోమన్నారు. నాయకుల మాటలతో ఇళ్లలో భార్య, పిల్లలకు మొహాలు చూపించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను ఉద్దేశించి కొజ్జాలు అని వ్యాఖ్యానించారని, మొగోళ్లమైనందునే పోలీసు వ్యవస్థలోకి వచ్చామని స్పష్టం చేశారు.
ఎస్పీ స్టీఫెన్ రవీంద్ర మీ ఇంటికొచ్చి తరిమిన చరిత్ర మర్చిపోయారా?
జిల్లా ఎస్పీగా పనిచేసిన స్టీఫెన్ రవీంద్ర మీ ఇంటికి వచ్చి తరిమిన చరిత్ర మరిచిపోయారా అని ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డిని ప్రశ్నించారు. సామాన్య ప్రజలకు భద్రత కల్పిస్తామని వ్యవస్థలోకి వచ్చామని, ఎంపీలు, ఎమ్మెల్యేలకు మాత్రమే కాదన్నారు. ఒకరిద్దరు నాయకులు మాట్లాడినంత మాత్రాన పోలీసు వ్యవస్థ డిఫెన్స్‌లోకి పడిపోదని, తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని హెచ్చరించారు.
నాగరికమైన వ్యవస్థలో ఉన్నామనే భావనతోనే ఐపీఎస్ అధికారులు ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ తీసుకొచ్చారని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీ జేసీపై ఫిర్యాదు అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. పోలీసు అధికారుల సంఘం సంయుక్త కార్యదర్శి సూర్యకుమార్, ఈసీ మెంబర్లు హరినాథ్, మసూద్, బాలాజీ నాయక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment