చిత్తూరు: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సొంత మండలం కల్కిరిలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి జైలు నుంచి విడుదల సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న అభిమానులపై పోలీసులు దాడులకు దిగారు. ఎస్సై సోమశేఖర్ రెడ్డి రెచ్చిపోయి అభిమానులపై విరుచుపడ్డాడు. ఈ దాడిలో వెంకట రమణారెడ్డి, గంగాధర్ లకు తీవ్ర గాయాలైయ్యాయి. ఈ ఘటన నిరసిస్తూ వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలు ధర్నా నిర్వహించి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వైఎస్. జగన్మోహన రెడ్డి ఈ సాయంత్రం చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నాంపల్లిలోని ప్రత్యేక సీబీఐ కోర్టు జగన్కు నిన్న సాయంత్రం బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కోర్టు కోరిన షూరిటీలు సమర్పించిన తరువాత జగన్ విడుదల ఉత్తర్వులపై న్యాయమూర్తి దుర్గాప్రసాద్రావు మంగళవారం సంతకం చేశారు. దీంతో జైలు నుంచి తమ నాయకుడు బయటకు వస్తున్నాడని తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.