
పేకాటరాయుళ్లను అర్ధనగ్నంగా..
సాక్షి, చింతలపూడి: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పోలీసుల ఓవర్ యాక్షన్ చర్చనీయాంశమైంది. పేకాడుతూ దొరికిన ఆరుగురిని నడి రోడ్డుపై అర్ధనగ్నంగా నడిపించుకుంటూ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అర్ధనగ్నంగా ఉన్న వారితోనే వారి బైక్‌లను నెట్టిస్తూ మూడు కిలోమీటర్లు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. సీఐ రాజేష్ ఆధ్వర్యంలో ఈ ఘటన జరిగింది.
పోలీసుల చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. అందరికీ అవగాహన కోసమే ఇలా చేశామంటూ పోలీసులు సమర్ధించుకుంటున్నారు. బాధితుల బంధువులు చింతలపూడి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సీఐ రాజేష్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మానవ హక్కులను హరించే విధంగా సీఐ ఎలా ప్రవర్తిస్తారంటూ నిలదీశారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొన్ని రోజుల క్రితం ప్రగడవరంలోనూ పేకాటరాయుళ్లను సిఐ రాజేష్ అర్ధనగ్నంగా నడిపించారు. చింతలపూడి సీఐలు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గంజాయి స్మగ్లర్లకు సహకరించినందుకు గతంలో సీఐ దాసుపై సస్పెన్షన్ వేటు పడింది కూడా.