నోటిఫికేషన్ వివరాలను వెల్లడిస్తున్న డీజీపీ ఆర్.పీ.ఠాకూర్
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్: రాష్ట్రంలో 3,057 మంది పోలీసుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్ సోమవారం ఈ మేరకు నోటిఫికేషన్ వివరాలు వెల్లడించారు. 2016లో 5,516 మంది కానిస్టేబుళ్లు, 707 మంది ఎస్‌ఐ, ఏఎస్‌ఐలను, 16 మంది అసిస్టెంట్ జైలర్లు, 265 జైలు వార్డర్‌లు, నలుగురు అసిస్టెంట్ మాట్రిన్‌లను నియమించినట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,234 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిలో కొత్తగా 3,057 పోస్టులు భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభించామని వివరించారు. సివిల్ ఎస్‌ఐ 150, ఏఆర్ ఆర్‌ఎస్‌ఐ 75, ఏపీఎస్పీ ఆర్‌ఎస్‌ఐ 75, డిప్యూటీ జైలర్ 14, వార్డర్ 123, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 20, ఫైర్‌మెన్ 400, సివిల్ కానిస్టేబుల్ 1,600, ఏఆర్ కానిస్టేబుల్ 300, ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ 300 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు చెప్పారు.
వెబ్‌సైట్‌లో ‘ఎస్‌ఎల్‌పీఆర్‌బీ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ ద్వారా ఆన్‌లైన్‌లో ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, డిప్యూటీ జైలర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్స్ పోస్టులకు ఈనెల 24వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ సూచించారు. వీరికి డిసెంబర్ 16న రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో, తుది పరీక్ష ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహిస్తామన్నారు. కానిస్టేబుల్ పోస్టులకు డిసెంబర్ 7వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, వారికి వచ్చే ఏడాది జనవరి 6న ప్రాథమిక రాతపరీక్ష, ఫిబ్రవరి రెండో వారంలో దేహదారుఢ్య పరీక్ష, మార్చి మూడో వారంలో తుది పరీక్ష నిర్వహిస్తామని డీజీపీ చెప్పారు. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీలకు రూ.300, ఎస్సీ, ఎస్టీలకు రూ.150. కాగా, కానిస్టేబుళ్ల పదోన్నతుల కసరత్తు ఆఖరి దశలో ఉందని, వీలైనంత త్వరలోనే పదోన్నతులు కల్పిస్తామని డీజీపీ వివరించారు. సమావేశంలో ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజిత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment