- జాతర నిర్వహణలో స్పష్టంగా కనిపించిన వైఫల్యం
- ఏకపక్ష నిర్ణయాలతో భక్తులకు తీవ్ర ఇబ్బందులు
వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : ‘మేడారం జాతరను తెలంగాణ కుంభమేళా అనొద్దు.. ఇది కుంభమేళా కంటే ఎన్నోరెట్లు పెద్దది’ ఈ మాటలను పదేపదే ఉటంకించింది ఎవరో కాదు.. స్వయంగా రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు. మేడారం జాతరను ఆ స్థాయిలో అభివర్ణించిన అధికారి.. తీరా బందోబస్తు నిర్వహణలో మాత్రం విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
2012 జాతరతో పోలిస్తే ప్రస్తుత జాతరలో భక్తులు తీవ్ర అవస్థతకు గురయ్యారు. గంటల కొద్ది ట్రాఫిక్ స్తంభించింది. ప్రయాసకోర్చి మేడారం చేరుకున్న భక్తులు గద్దెల వద్ద ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. సామాన్య భక్తులే కాదు.. వీఐపీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇన్నేళ్ల జాతరలో పోలీసులు ఇంత అధ్వాన్నంగా బందోబస్తు నిర్వహించడం ఇదే తొలిసారి అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకపక్ష నిర్ణయాలతో మేడారం జాతరలో పోలీసులను అట్టర్‌ఫ్లాప్ చేసిన ఘనత ఉన్నతాధికారులదే అని కిందిస్థాయి సిబ్బంది వాపోతున్నారు. కోటి మంది వచ్చే జాతరకు పక్కా ప్రణాళిక లేకపోవడమే తమ వైఫల్యానికి కారణమని అంగీకరిస్తున్నారు.
కీలక ప్రాంతాల్లో కొత్తవారికి బాధ్యతలు..
భక్తులు మేడారం చేరడం.. తల్లుల దర్శనం తర్వాత ఇంటికి క్షేమంగా వెళ్లడమంతా పోలీసుల పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం జాతర మార్గంలోని కీలక ప్రదేశాల్లో ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు అవగాహన ఉన్న పోలీసు అధికారులను నియమించాల్సి ఉంది. ప్రతి జాతరలో ఇదే జరిగేది. ప్రస్తుత రూరల్ ఎస్పీ కాళిదాసు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.
స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్నవారిని కాదని ఈ ప్రాంతంపై ఎలాంటి అవగాహన లేని వారికి ట్రాఫిక్ నియంత్రణ బాధ్య తలు అప్పగించారు. హైదరాబాద్, ఖమ్మం, కృష్ణా, గుంటూ రు జిల్లాల నుంచి వచ్చిన వారికి ఈ విధులు అప్పగించడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని పోలీసులే చెబుతున్నారు. కొన్ని రిస్క్ పాయింట్లలో అనుభవం లేనివారిని ఉంచడంతో పరిస్థి తి చేయిదాటింది. పెట్రోలింగ్ క్రమపద్ధతిలో లేకపోవడంతో ములుగు నుంచి వరంగల్ వరకు ట్రాఫిక్ జామైంది.
సక్సెస్‌ఫుల్ అధికారుల జాడేది..
గతంలో మేడారం జాతర విధులు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిం చిన అనేక మంది అధికారులకు ఈ దఫా పిలుపు అందలేదు. మేడారం జాతరను సక్సెస్ చేసిన వారిలో చాలామంది ప్రస్తుతం లూప్‌లైన్ సర్వీసు, ఇతర జిల్లాల్లో ఉన్నారు. మిగతా అధికారులను పిలిచినప్పటికీ వారిని ఆహ్వానం అందకపోవడం శోచనీయం. మేడారం జాతర విజయవం తం కావడంలో గతంలో విధులు నిర్వర్తించిన పోలీస్ అధికారులు దయానందరెడ్డి, నాగరాజు, తిరుపతి, చంద్రశేఖర్ అవధాని, సురేందర్‌రెడ్డి, రవికుమార్, జనార్ధన్, నర్స య్య, ఫణిందర్‌వంటి వారి సహకారం కూడా ఈసారి తీసుకోలేదు.
ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఇటీవలే ఎన్నికల్లో బదిలీ అయి న వారికి, అనుభవం లేని వారికి బందోబస్తు విధులు ఇవ్వడంతోనే జాతరలో పోలీసు శాఖ విఫలమైందనే అభిప్రా యం వినిపిస్తోంది. జాతర సందర్భంగా రోడ్లపై గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వరంగల్ రేంజ్ ఐజీ రవి గుప్తా, వరంగల్ డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు హుటాహుటిన మేడారం జాతర ప్రాంగణానికి చేరుకున్నా రు. గురువారం, శుక్రవారం అక్కడే మకాం వేశారు. వీరిద్దరు జాతర ప్రాంతానికి చేరుకోక ముందు, వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడం గమనార్హం.
అధికారులకు పట్టని సిబ్బంది తిండీతిప్పలు..
మేడారం జాతర బందోబస్తు విధుల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వేలాది మంది పోలీసులను వినియోగించారు. వారికి సమయానికి భోజనం పెట్టడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారని కిందిస్థాయి పోలీసు అధికారులే చెబుతున్నారు. కొత్త బియ్యంతో వండిన అన్నం, కూరలు వేయకపోవడం, ఉన్న నాలుగు రోజులు పప్పు, చారుతోనే సరిపెట్టారని వాపోయారు. ఈ అంశం కూడా బందోబస్తుపై ప్రభావం చూపిందని కొందరు సిబ్బంది పేర్కొన్నారు.
డీఐజీ, రూరల్ ఎస్పీపై బదిలీ వేటు ?
వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు, రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసుపై బదిలీ వేటుపడే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మేడారం జాతర సందర్భంగా పోలీసుల వైఫల్యంపై భక్తుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ కారణంతో ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీకి రంగం సిద్ధమైందని తెలిసింది. ప్రస్తుతం పోలీస్ డిపార్‌టమెంట్‌లో ఇదే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. వారి బదిలీకి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి.