చంద్రబాబు ఫొటో లేకపోతే కార్లు వెనక్కు తీసుకోండి
చంద్రబాబు ఫొటో లేకపోతే కార్లు వెనక్కు తీసుకోండి
Published Sat, Jun 24 2017 11:12 PM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM
కలెక్టర్‌కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ఆదేశం
ఎస్సీ కార్పొరేషన్‌కు రూ. 2,177 కోట్లు
గొల్లప్రోలు (పిఠాపురం) : ఎస్సీ లబ్ధిదారులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ సబ్సిడీపై అందజేసిన ఇన్నోవా కార్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటో లేకుంటే వాటిని వెనక్కు తీసుకొని కొత్త లబ్ధిదారులకు అందజేయాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు కలెక్టర్ కార్తికేయ మిశ్రాను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వరంలో గొల్లప్రోలులోని సత్యకృష్ణ ఫంక‌్షన్ హాలులో పిఠాపురం నియోజకవర్గ స్థాయిలో ఎస్సీ నిరుద్యోగ యువత, అంబేడ్కర్ సంఘాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జూపూడి, కలెక్టర్ కార్తికేయమిశ్రా హాజరయ్యారు. తొలుత డాక్టర్ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్, బాలయోగి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం జ్యోతిప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూపూడి మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ. 2,177 కోట్లు వివిధ పథకాల ద్వారా 1,26,519 మంది ఎస్సీ లబ్ధిదారులకు అందజేశామన్నారు. జిల్లాలో రూ. 300 కోట్లు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఉన్నాయన్నారు. ఎస్సీ లబ్ధిదారులంతా వివిధ పథకాలను ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో 120 ఇన్నోవా కార్లు అందజేశామని, ఈఏడాది మరో 220 ఇన్నోవాకార్లు, 500 ట్రాక్టర్లు, బొలేరో వాహనాలు ఎస్సీ యువత ఉపాధి కోసం అందజేస్తామని తెలిపారు. యూత్‌వే పోర్టల్‌లో 2.96 లక్షల మంది రిజిస్టరైన నిరుద్యోగులకు నైపుణ్యశిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్రంలో మొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు. కలెక్టర్ కార్తికేయమిశ్రా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ యాక్షన్‌ప్లాన్ రూపొందించిన ఘనత జూపూడికి దక్కుతుందన్నారు. భూమి కొనుగోలు చేసుకునే రైతులు అర్జీలు పెట్టుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ నియోజవర్గంలోని 4 వేల మంది నిరుద్యోగ యువతకు భరోసా కల్పించే ధ్యేయంతో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగయువత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తులు అందజేశారు. గొల్లప్రోలు, కొత్తపల్లి జెడ్పీటీసీ సభ్యులు మడికి సన్యాసిరావు, బత్తుల చైతన్యరాజేష్‌కుమార్, పిఠాపురం ఎంపీపీ ముంజవరపు విజయలత, సెంట్రల్‌బ్యాంకు డైరెక్టర్ గుడాల రామకృష్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వి. డేవిడ్‌రాజు, ఎస్సీ నాయకులు దానం లాజర్‌బాబు, లింగంరాజు, ఆలపు సూరిబాబు, భీమారావు, ఎంపీడీఓలు పి. విజయథామస్, నారాయణమూర్తి, తహసీల్దార్లు వై. జయ, రత్నకుమారి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement