ఆస్ట్రేలియన్ మహిళ అస్థిపంజరం వెలికితీత
అనంతపురం : పుట్టపర్తిలో హత్యకు గురైన ఆస్ట్రేలియన్ మహిళ టోనీ అన్నేల్ గేట్ మృతదేహానికి శవ పరీక్ష పూర్తియింది. టోనీ అస్తిపంజరం నుంచి బంగారు చైన్తో పాటు రెండు ఉంగరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తి డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ మృతదేహానికి డీఎన్ఏతో పాటు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించారు. వాటిని బెంగళూరుకు పంపించనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా సత్యసాయి భక్తురాలైన టోనీ అన్నెల్ గేట్ ఈ ఏడాది జూలై 23న పుట్టపర్తికి వచ్చింది. అప్పటి నుంచి ఆగస్ట్ 14 వరకు ప్రశాంతి నిలయంలోని మిత్రురాలి ఇంటిలో గడిపింది.
ఆగస్ట్ 15 నుండి వివేకానందనగర్‌లో సాయిగౌరీ అపార్ట్‌మెంట్‌లోని 304 నంబర్ గదిలో నివసిస్తోంది. ఆగస్టు 28న వస్తువుల కొనుగోలు విషయమై బెంగళూరు వెళ్తున్నానని తన మిత్రురాలు సుట్టర్‌కు సమాచారం ఇచ్చింది. ఆ మరుసటి రోజు నుండి టోనీ కనిపించలేదు. అనుమానం వచ్చిన సుట్టర్ అక్టోబర్ 12వ తేదీన పుట్టపర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది. సాయిగౌరీ అపార్ట్మెంట్ వాచ్మెన్, మరొకరితో కలిసి టోనీని డబ్బుకోసం హతమార్చారు.