స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర, రిజిస్టర్డ్ లేదా కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీల అధ్యక్షులు ఆథరైజేషన్ చేసిన నేతలు కూడా ఆ పార్టీల అభ్యర్థులకు ‘బీ’ ఫారాలను ఇవ్వవచ్చని
ఉపసంహరణ రోజూ ‘బీ’ ఫారం ఇవ్వొచ్చు
Published Mon, Mar 10 2014 2:16 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర, రిజిస్టర్డ్ లేదా కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్న పార్టీల అధ్యక్షులు ఆథరైజేషన్ చేసిన నేతలు కూడా ఆ పార్టీల అభ్యర్థులకు ‘బీ’ ఫారాలను ఇవ్వవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. పార్టీ అధికారిక అభ్యర్థులు ‘బీ’ ఫారాలను నామినేషన్ల ఉపసంహరణకు నిర్దేశించిన చివరి తేదీన కూడా ఇవ్వవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు కార్యదర్శి నవీన్‌మిట్టల్ ఆదివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
‘బీ’ ఫారాలు ఇవ్వడానికి పార్టీ అధ్యక్షుడు ఇచ్చే ఆథరైజేషన్ ఫారం ‘ఏ’ను మాత్రం నామినేషన్ల దాఖలు చివరి తేదీన సాయంత్రం 5 గంటల్లో గా జిల్లా ఎన్నికల అధికారి (కలెక్టర్లు), మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల రిటర్నింగ్ అధికారులకు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పారు. కలెక్టర్‌కు ఫారం ‘ఏ’ అసలు ప్రతిని, దాని జిరాక్స్ ప్రతులను మున్సిపల్ కమిషనర్లకు పంపాలని వివరించారు.
ఎవరికీ అథరైజేషన్ ఇవ్వనిపక్షంలో పార్టీ అధ్యక్షుడే ఫారం ఏ, ఫారం బీపై సంతకాలు చేసి నేరుగా రిటర్నింగ్ అధికారులకు పంపవచ్చని తెలిపారు. అభ్యర్థి ‘బీ’ ఫారంను పార్టీ అధ్యక్షుడే నేరుగా ఇచ్చినపక్షంలో ఫారం ‘ఏ’ ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ఒకే వార్డు/డివిజన్‌లో పలువురు అభ్యర్థులకు ‘బీ‘ ఫారం ఇస్తే.. మొదటగా ‘బీ’ ఫారం ఇచ్చిన వారినే అధికారిక అభ్యర్థిగా గుర్తిస్తామని స్పష్టంచేశారు.
లేని పక్షంలో ఎవరెవరి ‘బీ’ ఫారాలను రద్దు చేస్తున్నారో అధ్యక్షుడు మరో లేఖ ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. అభ్యర్థి నామినేషన్ పత్రంలో ఓ పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లు పేర్కొని, గడువులోగా ఆ పార్టీ నుంచి ‘బీ’ ఫారం తెచ్చుకోలేకపోతే అతన్ని స్వతంత్ర అభ్యర్థిగా పరిగణిస్తామని తెలిపారు.
Advertisement
Advertisement