పొలిటికల్ పంచ్ రవికిరణ్‌కు బెయిల్ మంజూరు
పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్‌కు మంగళగిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శాసనమండలికి సంబంధించి అసభ్యకరంగా పోస్టు పెట్టారని టీడీపీ నాయకుడు టీడీ జనార్దన్ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు ఫిర్యాదు చేయగా, ఆయన పోలీసులకు అదే విషయంపై ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు తొలుత విచారణ పేరుతో పలుమార్లు వేధించడమే కాక అర్ధరాత్రి వచ్చి ఎవరో కూడా సరిగా చెప్పకుండా ఇంటినుంచి తీసుకెళ్లిపోయారు. చివరకు హైడ్రామా అనంతరం అరెస్టు చేశారు.
ఆ తర్వాత పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తనపై అసభ్యకరంగా పోస్టు పెట్టారని రవికిరణ్ మీద ఫిర్యాదు చేయడంతో అక్కడ ఆయనను అరెస్టు చేశారు. ఈనెల 12న తుళ్లూరు పోలీసులు పీటీ వారంటు పెట్టి మంగళగిరి కోర్టులో సరెండర్ చేశారు. దాంతో కోర్టు ఈనెల 28వరకు రవికిరణ్‌కు రిమాండు విధించింది. ఆ తర్వాత రవికిరణ్ తరఫు న్యాయవాది బెయిల్ కోసం దరఖాస్తు చేయడంతో అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదు చేసిన కేసులో బెయిల్ వచ్చింది. విశాఖపట్నం కేసులో కూడా బెయిల్ కోసం అప్పీలు చేశారు. ఆ కేసులో ఇంకా బెయిల్ రావాల్సి ఉంది.