
రసవత్తరంగా నంద్యాల ఉపఎన్నిక రాజకీయం
అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. భూమా నాగిరెడ్డి వారసున్ని ప్రకటించవద్దని మంత్రి అఖిలప్రియకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేశించారు. అఖిలప్రియ తల్లి దివంగత శోభానాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా భూమా వారసున్ని ప్రకటించాలని మంత్రి అఖిలప్రియ నిర్ణయించారు. ఈమేరకు ఆమె ప్రకటన కూడా చేశారు.
అభ్యర్థిని ముందుగా ప్రకటిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన చంద్రబాబునాయుడు అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించవద్దని అఖిలప్రియను ఆదేశించారు. ఇది ఇలా ఉండగా సీటు మాదంటే మాదని శిల్పా, భూమా వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఏకాభిప్రాయం వచ్చాకే అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ అధిష్టానవర్గం భావిస్తోంది.
అభ్యర్థి ఎంపికపై పార్టీదే తుది నిర్ణయం: అఖిలప్రియ
నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీదే తుది నిర్ణయమని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. తన తల్లి శోభానాగిరెడ్డి మూడో వర్థంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. దీనిపై చర్చిచేందుకు రెండుమూడు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తానన్నారు.