పోల్ కేక
- అత్యధికం.. పెందుర్తిలో 92.1
- అత్యల్పం.. కశింకోటలో 69.66
- 6.30 గంటలకేబారులు తీరిన ఓటర్లు
- ఓటింగ్ సరళిని వెబ్‌కెమేరా ద్వారా తెలుసుకున్న అధికారులు
- డీఎల్‌పురంలో ఓటేసి వృద్ధుని మృతి
- బ్యాలెట్‌పై సిరాతో అనకాపల్లి బీఆర్టీ కాలనీలో వివాదం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : తొలిదశ ప్రాదేశిక పోరు ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైనా..ఆ తర్వాత క్రమంగా వేగం పుంజుకుంది. 22 జెడ్పీటీసీలకు, 379 ఎంపీటీసీ స్థానాలకు సాయంత్రానికి అంచనాలకు మించి 83.2 శాతం ఓటింగ్ నమోదయింది. అత్యధికంగా పెందుర్తిలో 92.10 శాతం ఓటింగ్ జరగగా, అత్యల్పంగా కశింకోటలో 69.66 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి.
ఉదయం 6.30 నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల కోలాహలం మొదలైంది. ఎండ తీవ్రత ఉన్నా.. యువ ఓటర్ల నుంచి పండుటాకుల వరకూ ఉత్సాహంగా తరలి వచ్చి కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో ఇంటర్నెట్ సదుపాయమున్న 29 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసి అధికారులు జిల్లా కేంద్రం నుంచి స్వయంగా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. రాష్ట్ర పరిశీలకుడు టి. కృష్ణబాబు నక్కపల్లి మండలపరిషత్ కార్యాలయం నుంచి వెబ్‌కెమేరా ద్వారా పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. అలాగే 225 మంది వీడియోగ్రాఫర్లను నియమించి పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ తీరును వీడియో తీయించారు.
కొన్ని చోట్ల ఆలస్యంగా.. : 22 మండలాల్లో 2397 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో కొని చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. బ్యాలెట్ విధానం ద్వారా జరిగిన ఈ క్రతువులో ఎన్నికల సిబ్బంది ప్రారంభంలో కొంత ఇబ్బం దులు పడ్డారు. దీంతో పెందుర్తి మండలం కోట్నివానిపాలెం దాదాపు 45 నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైంది. గొరపల్లిలో 7.30 అధికారులు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. అనేక కేంద్రాల్లో నిర్ణీత సమయం కంటే 10 నుంచి 20 నిమిషాలు ఆల స్యంగా పోలింగ్ మొద లైంది.
ఆ తరువాత మాత్రం ఓటర్లు అధిక సంఖ్యలో కేంద్రాలకు వచ్చినప్పటికీ వేగవంతంగా ప్రక్రియను పూర్తి చేశారు. నక్కపల్లి మండలం డిఎల్‌పురంలో కిల్లాడ నాగరాజు ఉరఫ్ కొండయ్య(68) ఓటేసి ఇంటికెళ్లాక మృతి చెందాడు. అనకాపల్లి మండలం బీఆర్‌టీకాలనీ పోలింగ్ కేంద్రంలో బ్యాలెట్‌పై సిరా అంటుకోవడం వివాదాస్పదమైంది. దీంతో పోలీసులు అత్యత్సాహం కనబరిచి లాఠీచార్జి చేశారు. ఉద్రిక్తత నేపథ్యంలో ఏఎస్పీ పకీరప్ప అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఎండను లెక్క చేయక.. : ఓటర్ల సంకల్పం ముందు ఎండ చిన్నపోయింది. ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోత సైతం ఓటర్లను నిలువరించలేకపోయిం ది. మంటలు పుట్టించే వేడి వాతావరణంలో భారీగా లైన్లలో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా మహిళలు, వృద్ధులు సైతం ఇబ్బందులు పడుతూనే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ తొలి రెండు గంటలు భీమిలి(21 శాతం), ఎస్.రాయవరం(21 శాతం), రాంబిల్లి(18 శాతం) మినహా మి గిలిన మండలాల్లో కాస్త మందకొడిగానే జరిగింది.
9 గంటలకు 13.39 శాతం జరగగా...11 గంటలకు 30 శాతానికి పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 47.30 శాతం నమోదైంది. ఒకే సమయంలో భారీగా కేంద్రాలకు రావడంతో క్యూలైన్లలో ఇబ్బం దులు పడ్డారు. వసతుల కల్పనలో అధికారుల వైఫల్యంతో అవస్థలకు గురయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు 62.70 శాతం, సాయంత్రం 5 గంటలకు మొత్తంగా 83.2 శాతం పోలింగ్ జరిగింది.
కట్టుదిట్టమైన భద్రత
ఈ ఎన్నికల కోసం అధికారులు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లోనే కాకుండా అన్ని కేంద్రాల్లోను పకడ్బందీ చర్యలు చేపట్టారు. దీంతో చిన్నచిన్న సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పెందుర్తి, భీమిలి మండలంలో కొన్ని కేంద్రాల వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారంటూ ఓటర్లు కొంత అసహనం వ్యక్తం చేశారు. అయితే ఎక్కడా ఎటువంటి కొట్లాటలు, అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు నిలువరించగలిగారు. తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో జిల్లా అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రెండో దశ ఎన్నికలు ఈ నెల 11న 17 జెడ్పీటీసీ, 277 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్నాయి.
సిబ్బంది గైర్హాజరుపై కలెక్టర్ కొరడా
ఎన్నికల విధులకు డుమ్మా కొట్టిన సిబ్బందిపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. ప్రాదేశిక ఎన్నికలకు 220 మంది గైర్హాజరవడాన్ని తీవ్రంగా పరిగణించారు. వారందరిపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. తొలివిడత పోలింగ్‌కు 1295 మంది పీవోలు, 3883 మంది ఏపీవో, 1295 మంది ఓపీవోలు మొత్తంగా 6473 మందిని ఎన్నికల విధులకు నియమించారు. వీరిలో 220 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదేశాలమేరకు విధులకు రాని వారి జాబితాను జెడ్పీ సీఈవో మహేశ్వరరెడ్డి ఆదివారం సాయంత్రమే అందజేశారు. వారందరిపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులు
పోలింగ్ అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులను ఆయా మండలాల రిసెప్షన్ సెంటర్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. విశాఖ డివిజన్‌లోనివి శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్‌లోను, అనకాపల్లి డివిజన్‌వి ఏఎంఏఎల్ కళాశాలలోను, నర్సీపట్నం డివిజన్‌వి డాన్‌బాస్కో స్కూల్‌లోని స్ట్రాంగ్‌రూమ్‌ల్లో భద్రపరిచారు.