సంగారెడ్డి జోన్, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రెండు రోజుల సమ్మెలో భాగంగా జిల్లాలో పోస్టల్ సేవలు నిలిచిపోయాయి. జీపీఓ సంగారెడ్డి, మెదక్ డివిజన్ తపాల కార్యాలయాల పరిధిలో మొత్తం నాలుగు హెడ్ తపాల కార్యాలయాలు, 90 సబ్ పోస్టాఫీసులు, 500 బ్రాంచ్ పోస్టాఫీసులు ఉన్నాయి. వీటిలో వివిధ కేడర్లలో విధులు నిర్వహిస్తున్న వెయ్యికి పైగా పోస్టల్ ఉద్యోగులు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్, ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఉత్తరాల బట్వాడా, చిన్నమొత్తాల పొదుపు వంటి కార్యకలాపాలు స్థంభించాయి.
సమ్మె సందర్భంగా ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆయా పోస్టల్ కార్యాలయాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సంగారెడ్డి, సిద్దిపేట, జోగిపేట రైల్వే రిజర్వేషన్ సేవలను పోస్టల్ శాఖలే నిర్వహిస్తుండటంతో రైల్వే రిజర్వేషన్ కౌంటర్లు తెరుచుకోలేదు. సంగారెడ్డి హెడ్ పోస్టాఫీస్ వద్ద కొనసాగిన నిరసన కార్యక్రమానికి హాజరైన ఎన్‌యూపీఈ డివిజనల్ అధ్యక్షుడు శంకర్, జనరల్ సెక్రటరీ మాణయ్య మాట్లాడుతూ ప్రభుత్వం పోస్టల్ శాఖలోని ఖాళీలను భర్తీ చేయకుండా ఉద్యోగుల పనిభారం పెంచుతోందన్నారు.
మధ్యంతర భృతి, డీఏను మూలవేతనంలో కలిపి నూతన వేతన సవరణ చేయడంలో మీన మేషాలు లెక్కిస్తూ కాలయాపన చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో పోస్టల్ ఉద్యోగ సంఘాల నాయకులు భూపాల్, రాఘవరావు, శ్రీనివాస్, సంజీవ్, సాబెర్, ప్రభాకర్, రాములు, రాజేందర్ రెడ్డి, వివిధ సబ్‌పోస్టాఫీస్ బ్రాంచి పోస్టాఫీసు ఉద్యోగులు పాల్గొన్నారు.
సమ్మెతో నిలిచిపోయిన పోస్టల్ సేవలు
Published Wed, Feb 12 2014 11:45 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement