సుకన్యతో సమృద్ధి..!
♦ ఆడ పిల్లలకు ప్రయోజనకరం
♦ 0–10 ఏళ్లలోపు పిల్లలకు వర్తింపు
♦ కాల పరిమితి 21 ఏళ్లు
♦ ఆదాయ పన్ను మినహాయింపు
♦ ఆకర్షణీయమైన వడ్డీ రేటు
ఖమ్మం వ్యవసాయం:
ఆడపిల్లల విద్య, వివాహ అవసరాల కోసం, ఆర్థిక పరిపుష్టి కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా రూపొందించినదే ‘సుకన్య సమృద్ధి పథకం’. పదేళ్ల లోపు ఆడపిల్లల కోసం ఈ పథకాన్ని రూపొందించారు. 21 ఏళ్ల వరకు ఈ పథకంలో ఆడపిల్లల పేరిట డిపాజిట్లు చేసుకునే అవకాశముంది. సహజ వడ్డీ రేట్లతో సంబంధం లేకుండా ఈ పథకానికి ప్రభుత్వం ప్రత్యేక వడ్డీ రేటు కల్పించింది. ఏడాదికోమారు వడ్డీ రేట్లలో తేడా వస్తున్నప్పటికీ సహజంగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసే మొత్తాలకు ఇచ్చే వడ్డీ రేట్లకన్నా ఎక్కువగానే ఈ పథకానికి వడ్డీ వస్తుంది.
ఇలా ప్రారంభించాలి
⇔ పదేళ్ల లోపు ఆడపిల్లల పేరున ఈ అకౌంట్‌ను వారి తల్లిదండ్రులుగానీ, చట్టపరమైన సంరక్షకులుగానీ రూ.1000 డిపాజిట్‌తో ప్రారంభించాలి.
⇔ అకౌంట్ ప్రారంభించిన నాటి నుంచి 21 సంవత్సరాల తరువాత ఈ అకౌంట్‌ను క్లోజ్ చేసుకోవచ్చు. లేదా డిపాజిటర్‌కు 18 సంవత్సరాల తరువాత వివాహమైతే ఈ ఖాతాను క్లోజ్ చేసుకోవచ్చు.
⇔ ఆడపిల్లలకు 18 సంవత్సరాల వయసు నిండిన తరువాత ఈ అకౌంట్‌లోని సొమ్ములో 50 శాతం మొత్తాన్ని ఒకేసారి వెనక్కు తీసుకోవచ్చు.
⇔ మొదటి డిపాజిట్ పరిమితి రూ.1,000
⇔ ఏడాదికి గరిష్ట పరిమితి రూ.1,50,000.
⇔ ఈ ఖాతాలో ప్రతి ఆర్థిక సంవత్సరానికి కనీసం రూ.1000 జమ చేయాలి.
⇔ ఏడాదికి కనీసం ఒక డిపాజిట్‌కు తగ్గకుండా ఉండాలి. గరిష్ట డిపాజిట్‌లకు పరిమితి లేదు.
⇔ ఖాతా తెరవదలిచిన వారు ఆడపిల్ల పుట్టిన తేదీ సర్టిఫికేట్ నకలు, తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు, లేదా ఏదైనా గుర్తింపు కార్డు నకలును, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను దరఖాస్తుకు జత చేయాలి.
⇔ సుకన్య సమృద్ది ఖాతాలో వేసిన పొదుపు సొమ్ము, లభించిన వడ్డీ మొత్తాలకు సెక్షన్ 80–సీ ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.
⇔ ఈ ఏడాది (01–07–2017 నుంచి 30–09–2017 వరకు) వడ్డీ రేటు శాతం 8.3. ఈ వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి.