తపాలాలో నోట్ల మార్పిడి గందరగోళం
- డిమాండ్‌కు తగ్గట్టు డబ్బు పంపని ఆర్బీఐ, స్టేట్‌బ్యాంక్
- కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కిల్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: రద్దయిన పెద్ద నోట్లను మార్చుకునేందుకు తపాలా శాఖనూ ప్రజల ముంగిట నిలిపినా... రిజర్వు బ్యాంకుకు తపాలాశాఖకు మధ్య అనుబంధంగా ఉండే స్టేట్‌బ్యాంకు దీనిని నీరుగారుస్తోంది. రూ.1,000, రూ.500 నోట్లను మార్చుకునేందుకు ప్రజలు తపాలా కార్యాలయాల ఎదుట బారులు తీరుతున్నారు. ఖాతాలు లేనివారు కూడా నోట్ల మార్పిడి చేసుకునేందుకు పోస్టాఫీసులకు వెళుతున్నారు. కానీ చాలినంత నగదు సరఫరా కాకపోతుండడంతో కొద్దిసేపటికే కౌంటర్లు మూసేయాల్సి వస్తోంది.
రూ.60 కోట్లు అడిగితే రూ.20 కోట్లు
రాష్ట్రంలో 36 తపాలా కార్యాలయాలు, 822 ఉప తపాలా కార్యాలయాల్లో నోట్ల మార్పిడికి అవకాశం కల్పించారు. దీంతో ప్రజలు పోస్టాఫీసులకు వెళుతున్నారు. తపాలా కార్యాలయాల నుంచి తొలి రోజే రూ.52 కోట్లు విత్‌డ్రా అయ్యారుు. కానీ ఆరోజు ఆర్‌బీఐ, స్టేట్‌బ్యాంకుల నుంచి కేవలం రూ.15 కోట్లు మాత్రమే తపాలా కార్యాలయాలకు చేరారుు. అంటే జనం ఎగబడేసరికి ఏం చేయాలో పాలుపోక సొంత నిధులను కూడా వాడేశారు. అరుుతే తపాలా ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ఆర్‌బీఐ, స్టేట్‌బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లి.. తమకు పంపిణీచేసే నగదు మొత్తాన్ని పెంచాలని కోరారు. సగటున రోజూ రూ.55 కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకు విత్‌డ్రాయల్స్ జరుగుతుండగా.. బ్యాంకుల నుంచి వచ్చేది రోజూ రూ.25 కోట్లకు మించడం లేదు. దీంతో తపాలా కార్యాలయాల్లో గందరగోళం నెలకొంది. బుధవారం ప్రధాన తపాలా కార్యాలయమైన జీపీఓ నుంచి రూ.5 కోట్ల ఇండెంట్ ఆర్‌బీఐకి చేరింది. ఆర్‌బీఐ కేవలం రూ.కోటిన్నర మాత్రమే ఇచ్చింది. ఇలాగైతే నగదు మార్పిడి సాధ్యం కాదని ఆ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. బుధవారం ఈ విషయాన్ని ఢిల్లీలోని తపాలా కార్యదర్శి దృష్టికి తీసుకురాగా.. ఆయన కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితో మాట్లాడారు.
పాతనోట్లు తీసుకోని బ్యాంకు..
ప్రజల నుంచి సేకరించిన పాత నోట్లను తపాలా శాఖలు ఏరోజుకారోజు సంబంధిత స్టేట్ బ్యాంకుకు పంపుతున్నారుు. కానీ అవి తమవద్దే పేరుకుపోతున్నందున తపాలా పంపే నోట్లను తీసుకోబోమని బ్యాంకు అధికారులు చెబుతున్నట్లు సమాచారం. దీనిపైనా స్థానిక తపాలా అధికారులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు తపాలా పొదుపు ఖాతాల్లో డిపాజిట్లు భారీగా పెరిగారుు.