పోరాట స్ఫూర్తి
సాగరతీరంలో పాంచజన్యం ప్రతిధ్వనించింది. నాడు కురుక్షేత్ర సంగ్రామంలో పార్థసారథి పూరించిన ఆ శంఖనాదం దిగంతాలను తాకితే .. నేడు సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా సాగిపోతున్న వైఎస్ తనయ, జగన్ సోదరి షర్మిల ‘సమైక్య శంఖారావం’ సమరనాదమై విచ్ఛిన్నకర శక్తుల గుండెల్లో గుబులు రేపింది. తమనిర్విరామ పోరుకు ఆలంబనగా, తమ ఆకాంక్షలకు అద్దంపట్టేలా అవిశ్రాంతంగా బస్సు యాత్ర జరుపుతున్న సోదరికి ఆదివారం విశాఖ జిల్లా, నగరవాసులు నీరాజనాలు పట్టారు. ఈ యాత్ర జన ఉద్యమావేశాన్ని ఉప్పెనలా మార్చింది..రేపటి వేకువ కోసం కలిసి పయనిద్దామని చేయి కలుపుతూ సాగింది.
సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరం ఉప్పొంగింది. దివంగత నేత వైఎస్ తనయను చూసేందుకు కదలివచ్చింది. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా ఆదివారం నగరంలోకి ప్రవేశించిన షర్మిలకు ఎదురెళ్లి బ్రహ్మరథం పట్టింది. షర్మిల కూడా అదే ఆప్యాయతతో అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రధానంగా ఆమె యాత్ర సమైక్యవాదుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. ప్రజల బాగు కోసం రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు ఎంతటి పోరుకైనా సిద్ధమని ఆమె చేసిన ప్రకటన అందరిలో పోరాట స్ఫూర్తిని రగిల్చింది. నక్కపల్లి బస నుంచి సరిగ్గా ఆదివారం ఉదయం 9.40 గంటలకు షర్మిల బయల్దేరారు.
అక్కడి నుంచి జాతీయ రహదారిపై ఎస్.రాయవరం, ఎలమంచిలి, కశింకోట, అనకాపల్లి, గాజువాక మీదుగా విశాఖ మహానగరపాలక సంస్థ పరిధిలోని నాలుగు నియోజకవర్గాలు దాటుకుని జగదాంబ సెంటర్‌కు మధ్యాహ్నం 12.14 గంటలకు చేరుకున్నారు. అప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున షర్మిలను చూసేందుకు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సమైక్య ఉద్యమం చేపట్టిన వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక సంఘాలు జననేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి ప్రసంగాన్ని వినడానికి రావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. 12.15 గంటలకు షర్మిల జగదాంబ సెంటర్‌లోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఏం పాపం చేశారని అన్నదమ్ములను విడదీశారు
తెలుగు ప్రజల ఓట్ల భిక్షతో అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ అన్నదమ్ముల్లా బతుకుతున్న ప్రజలను నిలువునా విడదీసి పాపం మూటగట్టుకుందని షర్మిల దుయ్యబట్టడంతో జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. మహానేత వైఎస్ బతికున్నప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోయిన రాష్ట్రం, ఇప్పుడు సమర్థనాయకత్వ లేమి, విభజన ప్రకటనతో కుక్కలు చించిన విస్తరిలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరినడిగి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని? అసలు ఆ అధికారం ఎవరిచ్చారంటూ మండిపడ్డారు. అసలు సీమాంధ్ర ప్రజలంతా హైదరాబాద్‌ను ఎందుకు వదిలిపోవాలని ప్రశ్నించడంతో సభికులంతా హర్షధ్వానాలు పలికారు. అసలు చంద్రబాబు లేఖ ఇవ్వడం వల్లే ఇప్పుడు రాష్ట్రానికి విభజన ముప్పు తలెత్తిందని, అలాంటి వ్యక్తి ‘హత్యచేసి తిరిగి ఆ శవం మీద పడి ఏడ్చిన తరహాలో’ మళ్లీ ప్రజల వద్దకు వస్తున్నారంటూ బాబు తీరును ఎండగట్టారు. అనంతరం 12.50 గంటలకు బయల్దేరి ఆనందపురం మండలానికి చేరుకున్నారు.
అడుగడుగునా నీరాజనం
జిల్లాలో షర్మిల రెండు రోజుల బస్సు యాత్ర పాయకరావుపేట, నక్కపల్లితో పాటు మరో ఎనిమిది మండలాలు మీదుగా సాగింది. జీవీఎంసీ పరిధిలోనూ ఈ యాత్ర దిగ్విజయమైంది. ఈ సందర్భంగా షర్మిలకు జనం అడుగడుగునా నీరాజనం పలికారు. శనివారం పాయకరావుపేటలో సభ అనంతరం ఆమె నక్కపల్లిలో రాత్రి బస చేశారు. దీంతో ఆదివారం ఉదయమే ఆమెను చూసేందుకు ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. బస్సు యాత్ర అనకాపల్లి బైపాస్ సెంటర్‌కు వచ్చే సరికి పెద్ద ఎత్తున జనం ఆమెను కలిసేందుకు ప్రయత్నించారు. కొందరు చెరకు రైతులు బెల్లం దిమ్మలను అభిమానంతో ఇచ్చారు. గాజువాక సెంటర్‌లో షర్మిలను చూసేందుకు వచ్చినవారితో రహదారులు నిండిపోయాయి. సమైక్యవాదులు నిరసన శిబిరాల నుంచి బయటకు వచ్చి షర్మిలకు స్వాగతం పలికారు.