పగలే చుక్కలు
పగలే చుక్కలు
Published Tue, Mar 18 2014 1:02 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
సాక్షి, గుంటూరు :జిల్లాలో నిత్యం తెల్లవారు జామున గుంటూరు నగరంతో పాటు పట్టణాల్లో విద్యుత్ కోతలు విధించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మండల, పట్టణాల్లో ఫొటోస్టాట్ వంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారులు కుదేలవుతున్నారు. ఎండలు పెరగకముందే ఈ రకంగా అమలు చేస్తున్న కోతలతో జిల్లా ప్రజానీకం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పట్టణాల్లో అధికారికంగా గంటన్నర, అనధికారికంగా మరో గంటన్నర కోత విధిస్తున్నారు. పల్లెల విషయానికొస్తే పగలంతా కరెంటు ఉండటం లేదు. పల్లె ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఈ కోతలతో పల్లెల్లో తాగునీటి పథకాలకు గండం పొంచి ఉంది. పల్నాడు ప్రాంతంలోని ప్రజలకు ఇప్పటికే సెగ తగిలింది. వేసవి రాకముందే ఈ విధంగా కోతలు ఉంటే మండు వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. పెరుగుతున్న ఎండలు.. గత రెండు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చింది. ఎండ వేడిమి పెరుగుతోంది. తదనుగుణంగా ఏసీల వినియోగం పెరుగుతుండటంతో డిమాండ్‌కు, సరఫరాకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంటుంది.
పెరిగిన ఇండస్ట్రియల్ లోడు... జిల్లాకు ప్రతి రోజూ 9.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ కేటాయిస్తున్నారు. ఇందులో నగర వినియోగం 20 శాతంకు పైగా ఉంటోంది. జిల్లాలో గృహ విద్యుత్తు కనెక్షన్లు 13,09,239, కమర్షియల్ సర్వీసులు 92,920, వ్యవసాయ సర్వీసులు 69 వేలు, ఎల్‌టీ సర్వీసులు 11,324 ఉన్నాయి. ఇటీవల కాలంలో జిల్లాలో ఇండస్ట్రియల్ లోడు గణనీయంగా పెరిగింది. జిల్లాలో స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమలు అధికంగా ఉన్నందున, సీజన్ కూడా కావడంతో వినియోగం గతం కంటే రెట్టింపైంది. ఎస్పీడీసీఎల్ అధికారులు ఇందుకు తగ్గట్లు కరెంటు కోటా కేటాయించడం లేదు. సెంట్రల్ పవర్ గ్రిడ్ నుంచి ఎస్పీడీసీఎల్‌కు దక్కే వాటా 22 శాతం వరకు ఉంది. ఈ శాతాన్ని 25కు పెంచాలని కోరినా ఫలితం ఉండటం లేదు. ఇదిలావుంటే, రెండ్రోజుల నుంచి కరెంటు సరఫరా మెరుగ్గానే ఉందని, కోతలు తగ్గించినట్లు విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. శుక్రవారం అమలు చేయాల్సిన పవర్ హాలిడేను ఎత్తేసినట్లు వివరించారు.
Advertisement
Advertisement