కరెంట్ షాక్...
గుంటూరు, సాక్షి: అపాయింటెడ్ డే జూన్ 2 తర్వాత కరెంటు చార్జీలు మోత మోగనున్నాయి. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వినియోగదారుల నడ్డి విరిచే విధంగా జేబుకు చిల్లు పెట్టనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలు పెంచేందుకు డిస్కం ఈఆర్‌సీకి ప్రతిపాదనలు గతంలోనే సమర్పించింది. సార్వత్రిక ఎన్నికలు, ట్రాన్స్‌కో విభజన తదితర అంశాలతో కరెంటు చార్జీలను పెంచలేదు. రాష్ట్ర విభజన అనంతరం యూనిట్ కరెంటు చార్జీ శ్లాబు దాటితే ముక్కు పిండి రూ.300కు పైగా వసూలు చేయనున్నారు. కొత్త రాష్ట్రంలో కరెంటు వినియోగదారులకు దిమ్మతిరిగేలా డిస్కం షాక్ ఇవ్వనుంది.
చార్జీల పెంపు, కొత్త టారిఫ్‌లపై విద్యుత్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం 150 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే కరెంటు బిల్లు రూ.382.50 వస్తుంది. పెంచుతున్న కరెంటు చార్జీల ప్రకారం అదే 150 యూనిట్లకు గాను ఇకపై రూ.611.50 చెల్లించాలి. పొరపాటున ఒక యూనిట్ అదనంగా వాడితే అంటే 151 యూనిట్లు వాడితే బిల్లు రూ.927 రానుంది. ఒక్క యూనిట్టు పెరిగినందున అదనంగా రూ.316 బిల్లు రానుంది. 50 యూనిట్ల శ్లాబ్ పరిధికి యూనిట్ రేటు పెంచి వినియోగదారుడి నుంచి వసూలు చేయనున్నారు. ప్రస్తుతం 0-50, 51-100, 101-150 శ్లాబ్ పరిధిలో రూ.1.45, 2.60, 3.60 వంతున లెక్కకట్టి వసూలు చేస్తున్నారు. పెరిగే చార్జీల ప్రకారం యూనిట్టు ఈ శ్లాబ్‌ల పరిధిలోనే రేటు రూ.3.10, 3.75, రూ.5.38 వంతున ఉంటాయి.
150 యూనిట్లు దాటి ఒక్క యూనిట్టు పెరిగినా, 151-200 శ్లాబ్‌లోని యూనిట్ రేటు రూ.6.32 వంతున ఆ శ్లాబ్ మొత్తం వసూలు చేస్తారు. ఇప్పటికే డిస్కం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి ప్రతిపాదనలు సమర్పించి ఆమోదం కూడా పొందడంతో వినియోగదారులకు ఇక కరెంటు బిల్లు మోత మోగనుంది. గృహ వినియోగదారులకు వంద యూనిట్లకు ఉన్న శ్లాబును 50 యూనిట్లకు కుదించనున్నారు. ఈ బాదుడు అమలైతే జిల్లాలో వినియోగదారులపై ఏడాదికి రూ.360 కోట్ల భారం పడనుందని అంచనా. ప్రస్తుతం గుంటూరు సర్కిల్ నుంచి విద్యుత్తు బిల్లుల డిమాండ్ ఏటా రూ.1,980 కోట్లు వరకు ఉంది. చార్జీల పెంపుతో ఈ డిమాండ్ రూ.2,340 కోట్లు కానుంది. రాష్ట్ర విభజనతో సదరన్ డిస్కంకు సెంట్రల్ డిస్కం నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిశాయి. దీంతో వ్యవసాయ కనెక్షన్లకు అందిస్తున్న సబ్సిడీ పెరుగుతుందా? లేదా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది.