ఎన్టీపీసీపై నీలి నీడలు
గోదావరిఖని: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో బొగ్గు సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. సమయానికి బొగ్గు అందే పరిస్థితి కనుచూపు మేర కనిపించకపోవడంతో విస్తరణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎన్టీపీసీలో ప్రస్తుతం ఏడు యూనిట్లుండగా, వాటి ద్వారా 2,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ మేరకే సింగరేణి నుంచి బొగ్గు రవాణ అవుతోంది. ఎన్టీపీసీని విస్తరణలో భాగంగా మరో 1,320 మెగావాట్లతో రెండు యూనిట్లను ఏర్పాటు చేయడానికి సంస్థ ప్రణాళిక రూపొందించింది. బొగ్గు లింకేజీ సాధ్యం కాకపోవడంతో ఈ కొత్తపాట్ల ఏర్పాటు కష్టసాధ్యంగా మారుతోంది.
ఎన్టీపీసీకి కోల్ లింకేజీ ప్రకారం సింగరేణి రోజుకు సుమారు 35 నుంచి 40 వేల టన్నుల బొగ్గును రవాణా చేస్తోం ది. ఇది ప్రస్తుత ఏరోజు అవసరాలకు ఆ రోజు సరిపోతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఇతర కారణాలతో ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి తగ్గింది. దీంతో ఎన్టీపీసీకి రోజుకు 20 నుంచి 25 వేల టన్నుల బొగ్గుమాత్రమే రవాణా జరుగుతోంది. బొగ్గు సరిపోకపోవడంతో ఎన్టీపీసీ పలు యూనిట్లలో లోడ్ తగ్గించి విద్యుత్ ఉత్పత్తి చేయగా, పలు సందర్భాల్లో ఏకంగా యూని ట్లనే మూసివేసింది. ఇలా బొగ్గు లేక యూనిట్లను మూసివేయడం ఎన్టీపీసీ చరిత్రలోనే ప్రథమమని చెప్పవచ్చు.
ముందుకు సాగని నాల్గో దశ..
ఐదేళ్లకోసారి ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్లను విస్తరించాలన్న ప్రభు త్వ నిర్ణయం అమలుకు నోచుకోవడం లేదు. దీంతో రామగుం డం ఎన్టీపీసీ ప్లాంట్‌లో నాల్గో దశ విస్తరణ కింద చేపట్టాల్సిన 8,9 యూనిట్ల ప్రారంభం ముందుకు సాగడం లేదు. 2004లో 500 మెగావాట్ల ఏడో యూనిట్‌ను ప్రారంభించిన సంస్థ ఆనాటి నుంచి నేటి వరకు 1,320 మెగావాట్లతో 8,9 యూనిట్ల ప్రారంభానికి కుస్తీ పడుతూనే ఉంది. అనువైన స్థలం, నీరు, రైల్వే లైన్, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం బొగ్గు లింకేజీ లేకపోవడమే ఎన్టీపీసీ విస్తరణకు ప్రధాన అడ్డంకిగా మారిందని సంస్థ సీఎండీ అరూప్‌రాయ్ చౌదరి ఇటీవల రామగుండం ఎన్టీపీసీని సందర్శించిన సమయంలో అంగీకరించారు.
ప్రయత్నాలు ముమ్మరం... ఫలితం శూన్యం
కొత్త యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన 20వేల టన్నుల బొగ్గు కోసం ఎన్టీపీసీ ఇటీవల కోల్ ఇండియా పరిధిలోని వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ యాజమాన్యంతో చర్చలు జరిపింది. అయితే ఐదేళ్లు మాత్రమే ఎన్టీపీసీకి బొగ్గు రవాణా చేయగలుగుతామని అక్కడి అధికారులు ఖరాఖండిగా తేల్చిచెప్పారు. దీంతో ఐదేళ్ల తర్వాత బొగ్గు కోసం ఏం చేయాలనేది సమస్యగా మారింది.
సింగరేణి సంస్థ పరిధి గోదావరిఖనిలోని మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు కాలాన్ని 20 ఏళ్ల పాటు పెంచేందుకు వీలుగా విస్తరించాలని గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎన్టీపీసీకి సమీపంలో ఉండే మేడిపల్లి ఓసీపీ ఎల్‌ఈపీ (లైఫ్ ఎక్స్‌టెన్షన్ ప్రాజెక్టు)ను సింగరేణి నుంచి తీసుకుని క్యాప్టివ్ (సొంత అవసరాల కోసం ఉపయోగించుకునేందుకు) మైన్‌గా రూపాంతరం చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనకు ఎన్టీపీసీ యాజమాన్యం వచ్చింది. కానీ సింగరేణి యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం అధికారులను నిరాశపర్చింది.
తెలంగాణ ఏర్పడితేనే..
రామగుండం ఎన్టీపీసీలో ఉత్పత్తి చేస్తున్న 2,600 మెగావాట్ల విద్యుత్‌లో 27 శాతం మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తున్నా రు. తెలంగాణలో పంపుసెట్లపై వ్యవసాయం నడుస్తుండగా.. కేటాయిస్తున్న ఈ విద్యుత్ సరిపోవడంలేదు. అదే సమయంలో విశాఖపట్టణం జిల్లాలోని సింహాద్రి వద్దగల ఎన్టీపీసీ ప్లాంట్‌లో మూడు యూనిట్ల ద్వారా 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా.. అందులో వెయ్యి మెగావాట్లు కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతానికే వినియోగిస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రకమైన ఒప్పందం ఎన్టీపీసీ యాజమాన్యంతో చేయించారు.
ఈ ప్రాజెక్టుకు బొగ్గును ఒరిస్సాలోని తాల్చేర్ నుంచి, నీటిని సముద్రం నుంచి వినియోగిస్తున్నారు. కానీ తెలంగాణలోని బొగ్గు, నీటిని వినియోగిస్తూ ఈ ప్రాంతానికి తక్కువ విద్యుత్ కేటాయిస్తున్న విషయాన్ని తెలంగాణవాదులు పదేపదే కేంద్రానికి గుర్తుచేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమవుతున్న తరుణంలో రాబోయే కాలంలో అప్పటి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఎన్టీపీసీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. లేకపోతే రాబోయే రోజుల్లో ఎన్టీపీసీకి బొగ్గు రవాణా ఇబ్బందిగా మారడంతో పాటు విస్తరణ ముందుకు సాగే అవకాశాలుండవు.