పుట్టపర్తి (అనంతపురం జిల్లా) : ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా బకాయిలు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్‌ను నిలిపివేయడంతో పుట్టపర్తి అంధకారంలో మగ్గుతోంది. వివరాల ప్రకారం..గత కొన్ని నెలలుగా పుట్టపర్తి నగర పంచాయతీ విద్యుత్ బకాయిలను చెల్లించడంలేదు. దీంతో ట్రాన్స్‌కో అధికారులు నగర పంచాయతీకి నోటీసులు జారీ చేశారు. అయినా సరే నగర పంచాయతీ అధికారులు పట్టించుకోవడంలేదు.
రూ.1.14 కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి చేశారు. దీంతో గురువారం రాత్రి ట్రాన్స్‌కో అధికారులు నగరపంచాయతీ కార్యాలయానికి, వీధి దీపాలకు విద్యుత్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం పుట్టపర్తి నగర పంచాయతీ అంధకారంలో ఉంది. బిల్లులు చెల్లించకపోవడం, నోటీసులను బేఖాతరు చేయడంతోనే విద్యుత్‌ను నిలిపివేసినట్లు ఏడీఈ శ్రీనివాసులు తెలిపారు.