ప్రజాదర్బార్‌లో సమస్యల వెల్లువ
కర్నూలు(అగ్రికల్చర్):
ప్రజాదర్బార్‌కు వినతులు వెల్లువెత్తాయి. వినతుల తాకిడిని తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలు ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఆన్‌లైన్, మండల కేంద్రంలోని మండల పరిషత్‌లోని గ్రీవెన్స్‌లోను వినతులు ఇవ్వవచ్చని ప్రకటించింది. కానీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు ఇవేవి పట్టించుకోవడం లేదు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ నిర్వహించే ప్రజాదర్బార్‌లో వినతులు ఇస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు నమ్ముతున్నారు.
మరి వారి నమ్మకం నెరవేరుతుందా అంటే అదీ లేదు.. ఒకే సమస్యపై పరిష్కారం కోసం ఇటు ప్రజాదర్బార్ చుట్టూ అటు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జరిగిన ప్రజాదర్బార్‌లో జాయింట్ కలెక్టర్ కన్నబాబు, ఏజేసి రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్ గౌడ్ వినతులు స్వీకరించారు. కలెక్టర్ సిహెచ్.విజయ్‌మోహన్, ఉప ముఖ్యమంత్రి వెంట జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడంతో జేసీ గ్రీవెన్స్ నిర్వహించారు. వచ్చిన వినతులన్నింటిని స్కానింగ్ చేసి ప్రజావాణి వెబ్‌సైట్‌లో పెట్టారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన సమస్యల్లో ముఖ్యమైనవి.