
ఒంగోలు టౌన్: దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి బ్రిటీష్ వారిని ఎదిరించిన మహామనీషి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని రాష్ట్ర అటవీ శాఖామంత్రి శిద్దా రాఘవరావు కొనియాడారు. జిల్లా 49వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ప్రకాశం భవనంలోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ప్రకాశం పంతులు పరిపాలనలో అపారమైన అనుభవాన్ని సాధించారన్నారు. వెనుకబడిన కర్నూలు, నెల్లూరు, గుంటూరులోని కొన్ని ప్రాంతాలను కలిపి 1970లో ఒంగోలు జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. ప్రకాశం పంతులు జిల్లావాసి కావడంతో 1972లో ఆయన పేరున జిల్లాకు నామకరణం చేసినట్లు తెలిపారు. అలాంటి ప్రకాశం జిల్లాలో పరిశ్రమలు స్థాపించి అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు.
ప్రకాశం జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దొనకొండలో ఇండస్ట్రీయల్ పార్కు, కనిగిరిలో పరిశ్రమల కేంద్రం, రామాయపట్నం ఓడరేవు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. జిల్లాలో ట్రిపుల్ ఐటీ, మైనింగ్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సింగపూర్‌లో ఒక్క ఓడరేవు ఉంటే అది ఇతర దేశాలను శాసించే స్థాయికి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అపరమైన సహజ వనరులు ఉన్నాయన్నారు. వీటిద్వారా జిల్లాను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. జిల్లాలో పొగాకు ఉత్పత్తులకు, ఒంగోలు గిత్తలకు మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు కూడా ఇక్కడే ఉన్నాయన్నారు.
జిల్లా అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. జిల్లా కలెక్టర్ వీ వినయ్‌చంద్ మాట్లాడుతూ జిల్లాను వేగంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లా ప్రజలు ఎక్కువగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారన్నారు. జిల్లాలో నాగార్జునసాగర్, కొమ్మమూరు కాలువల పరిధిలో 4లక్షల 42వేల ఎకరాల భూములు ఉన్నాయన్నారు. రాళ్లపాడు, పాలేరు, కంభం చెరువుల ద్వారా 48వేల 536ఎకరాల భూమి సాగవుతోందన్నారు. జిల్లాలో 102కి.మీ. మేర సముద్రతీరం ఉందన్నారు. ఒంగోలులో 3.26కోట్ల రూపాయలతో ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment