పోలీసు అధికారులతో మాట్లాడుతున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్
సాక్షి, ఒంగోలు: ఆన్‌లైన్ దర్యాప్తుపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సూచించారు. శనివారం స్థానిక పోలీసు కల్యాణ మండపంలో సబ్ ఇన్‌స్పెక్టర్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారుల వరకు ఆన్‌లైన్ దర్యాప్తుపై అవగాహన కల్పించేందుకు సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆన్‌లైన్ దర్యాప్తు అనగానే సైబర్ క్రైం కాదని గుర్తుంచుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా నేడు సాంకేతిక వినియోగం పెరిగిపోయిందన్నారు. అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు సాంకేతికతను వినియోగిస్తూ పౌరులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒకచోట నేరం చేస్తూ మరోచోట తలదాచుకునే వారి గుట్టును సులువుగా ఛేదించాలంటే ఆన్‌లైన్ దర్యాప్తుపై అవగాహన అవసరమని అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు ఒక అనుమానితుడి వేలిముద్రను గుర్తించినప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరు యాప్ ద్వారా సులువుగా అతనిపై ఉన్న కేసులను తెలుసుకోవచ్చని, ఫింగర్ ప్రింట్ బ్యూరోకు పంపడం, వారు వాటిని సెర్చి చేసి నివేదిక అందించాల్సి రావడంతో వేగవంతమైన దర్యాప్తుకు ఆటంకం ఏర్పడుతోందన్నారు.
ప్రాథమిక అవగాహన కోసమే సెమినార్
ప్రస్తుతం నిర్వహిస్తున్న సెమినార్ కేవలం ప్రాథమిక అవగాహన కోసమేనని, ఇంకా మలిదశలో మరికొన్ని సెమినార్‌లు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. అన్ని దశల్లో శిక్షణ పూర్తి చేసుకుని అవగాహన పెంపొందించుకుంటే మీరే సుశిక్షితులైన సైబర్ ఎక్స్‌పర్ట్‌గా ఉంటారని సీనియర్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు సూచించారు. ప్రతి ఒక్క ప్రభుత్వ సంస్థ డేటా బేస్‌ను అందుబాటులో ఉంచితే ఆన్‌లైన్ దర్యాప్తునకు అవకాశం ఏర్పడిందన్నారు. చాలామంది ఆన్‌లైన్ దర్యాప్తునకు కేవలం ఈ కాప్స్ మీద ఆధారపడుతున్నారని, ఇది సమంజసం కాదని ఎస్పీ స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి తగ్గట్లు మనం కూడా వాటిని అందిపుచ్చుకుంటూ ముందడుగు వేయాలని సూచించారు. ఒక ప్రాంతంలో నేరం చేసిన వ్యక్తి మరో ప్రాంతంలో ప్రభుత్వ పథకాలు పొందే అవకాశాలు లేకపోలేదని, ఆధార్, మొబైల్ నంబర్, బ్యాంకు అకౌంట్, ఏటీఎం కార్డు వినియోగం, రేషన్ కార్డు వినియోగం, డ్రైవింగ్ లైసెన్స్ వినియోగం ఇలా అనేక రకాలైన వాటిలో ఏదో ఒకదాన్ని నేరగాడు తప్పకుండా వినియోగిస్తుంటాడని పేర్కొన్నారు.
దర్యాప్తు అంశాలపై సెల్‌లో శిక్షణ పొందుతున్న పోలీసు అధికారులు
క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టం (సీసీటీఎన్‌ఎస్) ప్రస్తుతం అందుబాటులో ఉన్నా అందులో కొంత సమస్య ఉందని, వాటిని సైతం అధిగమించేలా ప్రతి ఒక్కరు మారాలన్నారు. ఇప్పటి వరకు ఎవరో ఒకరిని ఇన్‌ఫార్మర్‌గా పెట్టుకుని నిందితులను అరెస్టు చేసేవారని, ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారా అతడిని ట్రేస్ చేసి ఎప్పుడు ఏ ప్రాంతంలో ఉంటాడో కూడా తెలుసుకోవడం ద్వారా దర్యాప్తు వేగవంతం కావాలని ఎస్పీ వివరించారు. పంజాబ్‌లో ఇటీవల నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారన్నారు. ఫలానా సమయంలో ఫలానా హత్య తానే చేశానని, ఎలా చేసింది కూడా వివరంగా సోషల్ మీడియాలో కొందరు పోస్టు చేస్తున్నారని, ఇటువంటి నేరస్తులను అరెస్టు చేయాలంటే సాంకేతి వినియోగంపై నైపుణ్యం తప్పనిసరన్నారు.
అద్దంకి సీఐ అశోక్‌వర్థన్ ఇటీవల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సంచలన కేసులను ఛేదించారని, ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకుని చిత్తశుద్ధితో ప్రాక్టీస్ చేయాలని వివరించారు. ఇక నుంచి నైట్ షిఫ్ట్‌ల్లో పనిచేసే వారు సాంకేతికతను ఎలా వినియోగించుకుంటున్నారనే దాన్ని పరిశీలించేందుకు ఒక ఐటీ టీమ్‌ను కూడా నైట్ షిఫ్ట్‌లో కొనసాగించాలని నిర్ణయించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఏ నేరస్తుడికి సంబంధించిన కేసులు కోర్టులో నడుస్తున్నాయి, వారు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారనేది కూడా తెలుసుకోగలుగుతామన్నారు.
ప్రతి ఒక్కరు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకుని సాంకేతిక నిపుణులుగా మారాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆకాంక్షించారు. దశల వారీగా తాము నిర్వహించే కార్యక్రమాల్లో ఎస్‌ఐ నుంచి డీఎస్పీ స్థాయి వరకు అధికారులు తాము ఏం నేర్చుకున్నామో కూడా అందరికీ వివరించాల్సి ఉంటుందన్నారు. సాయంత్రం వేలిముద్రలు, సైబర్ నేరాలకు సంబంధించిన వాటిపై ఆన్‌లైన్ ద్వారా ఎలా దర్యాప్తు చేయాలనే దానిపై డెమో ఇచ్చారు. డీఎస్పీ నేతృత్వంలో సంబంధిత సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలకు పెద్ద మానిటర్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. స్పెషల్ బ్రాంచి సీఐలు కె.శ్రీనివాసరావు, శ్రీకాంత్‌బాబు, ఐటీ కోర్ టీమ్ ఎస్‌ఐ నాయబ్‌రసూల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment