మదనపల్లె టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణి మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి మదనపల్లెలో జరిగింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందో ళనకు దిగారు. శుక్రవారం ఉదయం ఆస్పత్రి వద్దకు మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వారికి మద్దతుగా ప్రజా సంఘాల నాయకులు ధర్నా చేశారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గర్భిణి మృతిపై ఆస్పత్రి సిబ్బంది, మృతురాలి కుటుంబ సభ్యులను ఆరా తీశారు.
ములకలచెరువు మండలం దేవలచెరువు పంచాయతీ గోళ్లవారిపల్లెకు చెందిన దంపతులు గంగాధర్ నాయుడు, రాణెమ్మ (30) పదేళ్లుగా నీరుగట్టువారిపల్లె బాబుకాలనీలో నివాసం ఉంటూ కూలి మగ్గాలు నేసుకుంటున్నారు. 13 ఏళ్ల తర్వాత మొదటి సారి రాణెమ్మ గర్భం దాల్చింది. ఆమె ప్రతి నెలా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో ప్రసవం నొప్పులు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. పరీక్షించిన డాక్టర్లు ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు ఆపరేషన్‌కు అంగీకరించడంతో ఏర్పాట్లు చేశారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో రాణెమ్మను ఆపరేషన్ థియేటర్‌కు తరలిస్తుండగా అస్వస్థతకు గురైంది. ఆమెకు ఇంజక్షన్ ఇవ్వడంతో ఒక్కసారిగా కేకలు వేసి స్పృహతప్పింది.
డాక్టర్లు ఆమెకు చికిత్స అందించినా పరిస్థితి మారలేదు. విషమంగా మారడంతో తిరుపతికి తరలించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. అప్పటికే ఆమె మృతి చెందడంతో మృతురాలి కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. తమ బిడ్డను ప్రసవం చేసి కాపాడతారని ప్రభుత్వాస్పత్రికి తీసుకొస్తే అన్యాయంగా చంపేశారని సిబ్బందిపై ఘర్షణకు దిగారు. దీంతో ప్రభుత్వాసుపత్రిలోని అత్యవసర విభాగంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అర్థరాత్రి వరకు గొడవ కొనసాగింది. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ సురేష్ సిబ్బందితో ప్రభుత్వాస్పత్రికి చేరుకుని ఘర్షణ జరగకుండా ఇరువర్గాలకు సర్దిచెప్పారు. కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో అప్పటికి వివాదం సద్దుమనిగింది.
వైద్యుల నిర్లక్ష్యమే..
శుక్రవారం ఉదయం రాణెమ్మ మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వాస్పత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారికి ప్రజాసంఘాల నాయకులు వారికి మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. రాణెమ్మ మృతికి గల కారణాలపై వైద్యులు, మృతురాలి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాణెమ్మ మృతికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. మృతురాలి కుటుంబా నికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట జన్నే రాజేంద్రనాయుడు, సుబ్బానాయుడు, ఆంజనేయులు, భాస్కర్‌నాయుడు, సీపీఐ నాయకులు సాంబ, కాంగ్రెస్ నాయకులు శ్రీధర్, బాలాజీనగర్ షంషీర్, సురేంద్ర తదితరులు ఉన్నారు.
మాతాశిశు మరణాలు తగ్గించాలి
మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో వరుసగా మాతాశిశు మరణాలు జరుగుతుండడం బాధాకరమని, తగ్గేలా వైద్యులు కృషి చేయాలని డీసీహెచ్‌ఎస్ సరళమ్మ తెలిపారు. గర్భిణి రాణెమ్మ మరణవార్త తెలియగానే ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. ఆమెను డీసీహెచ్‌ఎస్‌ను ఎమ్మెల్యే తిప్పారెడ్డి నిలదీశారు. ప్రభుత్వాస్పత్రిలో ఏడాదిగా మాతాశిశు మరణాలు జరుగుతున్నా ఏమి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇలా అయితే పేదలు ప్రభుత్వాస్పత్రి దరిదాపులకు కూడా రారని తెలిపారు. డీసీహెచ్‌ఎస్ మాట్లాడుతూ వైద్య సిబ్బందిపై మృతురాలి బంధువులు దురుసుగా మాట్లాడి మనస్తాపానికి గురి చేశారని ఆరోపించారు. ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారని తెలిపారు. సిబ్బందిపై ఇలా దురుసుగా ప్రవర్తించడం తగదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment