చేతులెత్తేశారు... | Preposterous proposal | Sakshi
Sakshi News home page

చేతులెత్తేశారు...

Published Tue, Jul 1 2014 1:29 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

చేతులెత్తేశారు... - Sakshi

చేతులెత్తేశారు...

  •  అందని సాగునీరు
  •  కరుణించని వరుణుడు
  •  పెరిగిన సాగు వ్యయం, కౌలు
  •  నిరాసక్తిలో కౌలు రైతులు
  • చల్లపల్లి :  గత 15 ఏళ్ల నుంచి కౌలు సాగు చేస్తున్న మోపిదేవికి చెందిన కైలా నాగమల్లేశ్వరరావు ఈ ఏడాది కౌలుకు సాగు చేయొద్దని నిర్ణయించుకున్నాడు. ఖర్చులు పెరగడం, ఇంతవరకు కాలువకు నీరు రాకపోవడం, వర్షాలు పడకపోవడంతో కౌలుసాగు వదిలేసి కూలి పనులు చేసుకోవాలనుకుంటున్నాడు.
     
    చల్లపల్లికి చెందిన కౌలు రైతు రాయని సుబ్బారావు గత 12 ఏళ్లుగా వ్యవసాయమే ఆధారంగా కుటుంబాన్ని సాకుతున్నాడు. మూడేళ్ల క్రితం వరుసగా రెండు సార్లు పంటలు దెబ్బతిని నష్టాలు వచ్చినప్పటికీ పొలాలను వదులుకోని ఈ రైతు ఈ ఏడాది సాగుకు స్వస్తి చెప్పాడు.
     
    ఈ రైతులు తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుత పరిస్థితులకు దర్పణం పడుతున్నాయి. ఒకపక్క రుతుపవనాల జాడ లేదు. ఇటీవల రెండురోజుల పాటు మురిపించిన వర్షం ముఖం చాటేసింది. ఏటా జూన్ రెండోవారంలో పంట కాలువలకు నీరొదిలే అధికారులు ఈ ఏడాది సాగుకు నీరెప్పుడు వదులుతారో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికితోడు సాగుఖర్చులు పెరిగిపోవడం, భవిష్యత్‌లో వర్షాలు తక్కువగా ఉంటాయని చెప్పడంతో ఈ ఏడాది ఖరీప్‌లో సాగుచేసేందుకు కౌలు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. పామర్రు, ఉయ్యూరు, మొవ్వ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మచిలీపట్నం మండలాల్లో ఇప్పటికే చాలా మంది రైతులు కౌలు పొలాలను వదిలేసుకుంటున్నారు.
     
    తగ్గిపోతున్న కౌలు సాగు...

    జిల్లాలో 1.60 లక్షల మంది కౌలు రైతులు గత ఏడాది 3.40 లక్షల ఎకరాలు సాగుచేశారు. అంతకు ముందు సంవత్సరంలో 3.75 లక్షల ఎరకాల్లో సాగుచేయగా ఏటేటా కౌలు రైతులు సాగును వదిలేసుకుంటున్నారు. ఈ ఏడాది  మరో 60 నుంచి 70 వేల ఎకరాల్లో కౌలురైతులు వరిసాగును వదులుకోనున్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మూడేళ్ల క్రితం ఎకరాానికి 10 నుంచి 12 బస్తాలు కౌలుకు రైతులు సాగు చేయగా, గత ఏడాది 12 నుంచి 14 బస్తాలకు కౌలు పెంచేశారు. రెండో పంట మినుము సాగయ్యే ప్రాంతంలో 18 బస్తాల వరకు కౌలు చెల్లిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎరకాకు రూ.20 వేల సొమ్మును కౌలు కింద ముందే కట్టేస్తున్నారు.

    ఐదేళ్ల  క్రితం ఎకరాకు రూ.16 వేల నుంచి రూ.18 వేలు సాగు ఖర్చులు కాగా, రెండేళ్ల క్రితం ఎకరానికి రూ.18వేల నుంచి రూ.20 వేలకు పెరిగాయి. గత ఏడాది ఎకరాకు రూ.22 వేల నుంచి రూ.24 వేలకు ఖర్చులు పెరిగిపోయాయి. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా దిగుబడులు పెరగకపోవడంతో కౌలు రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. గత రెండేళ్లలో జిల్లాలో సాధారణ దిగుబడి ఎకరానికి 31 నుంచి 33 బస్తాలుండగా కౌలుపోను రైతుకు మిగిలేది 13 నుంచి 16 బస్తాలు.

    ఖర్చులు పోనూ రైతులకు నష్టాలే మిగులుతుండటంతో ఏటా కౌలురైతులు సాగును వదిలేసుకుంటున్నారు. రెండో పంటగా సాగుచేస్తున్న మినుము గత రెండేళ్ల నుంచి ఎకరానికి 2, 3 బస్తాలు మాత్రమే దిగుబడి రావడంతో కౌలు రైతులు మరింత అప్పుల ఊబిలోకి వెళ్లిపోతున్నారు. ఖరీఫ్‌లో వరిపంట సాగు ఆలస్యమైతే నవంబర్, డిసెంబర్‌లో సంభవించే విపత్తుల బారిన పడే ప్రమాదం ఉండటంతో సాగుచేసేందుకు కౌలు రైతులు వెనకడుగు వేస్తున్నారు.
     
    కౌలు రైతులను ఆదుకోవాలి...
     
    జిల్లా వ్యాప్తంగా 1.60 లక్షల మంది కౌలు రైతులు ఉంటే, వీరిలో 60 వేల మందికి మాత్రమే గత ఏడాది రుణాలు ఇచ్చారు. మిగిలిన రైతులు అందిన కాడికి అప్పులు తెచ్చి సాగుచేయగా గత రెండేళ్ల నుంచి వీరికి నష్టాలే మిగులుతున్నాయి. సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో విపత్తులు రావడంతో పంట దెబ్బతినడంతో కాయకష్టమంతా కౌలు చెల్లించేందుకే సరిపోయింది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement