చిత్తూరు : ఎర్రచందనం అక్రమ రవాణాలో పేరుమోసిన నలుగురు స్మగ్లర్లపై పీడీ యాక్టు నమోదయింది. చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో ఓఎస్డీ రత్న మంగళవారం మీడియాకు ఆ వివరాలను వెల్లడించారు. అజాజ్‌షరీఫ్, నాగేంద్రనాయక్, అబ్దుల్ ఖాదర్‌భాషా, ఇలియాజ్ ఖాన్‌లను పీడీ యాక్టు కింద వైఎస్సార్ జిల్లా సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం 35 మందిపై పీడీ యాక్టులు నమోదు చేశామన్నారు. వీరిలో 11 మంది బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ వీరిపై అనుమానిత కేసులు తెరిచి నిఘా ఉంచామని చెప్పారు. జిల్లాలో దాదాపు 200 మంది వరకు ప్రధాన స్మగ్లర్లను అరెస్టు చేయడం ద్వారా ఎర్రచందనం రవాణాను కాస్త తగ్గించామన్నారు. ఈ సమావేశంలో సీఐలు చంద్రశేఖర్, సురేంద్రరెడ్డి, ఆదినారాయణ, నర్శింహులు, ఎస్‌ఐ వెంకటచిన్న తదితరులు పాల్గొన్నారు.
నలుగురు ఎర్రస్మగ్లర్లపై ఉన్న కేసుల వివరాలు :
అజాజ్ షరీఫ్ : ఇతనికి అజ్జూ భాయ్, అన్వర్ షరీఫ్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇతను బెంగళూరులోని కటిగనహళ్లికి చెందిన అంతర్రాష్ట్ర స్మగ్లర్. వ్యవసాయం చేస్తూ విలాసవంతమైన జీవితం గడపడానికి ఐదేళ్లుగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 20 టన్నుల ఎర్రచందనం అక్రమంగా రవాణా చేశాడు. ఇతనిపై ఇప్పటి వరకు 20 వరకు కేసులు ఉన్నాయి.
బుక్కా నాగేంద్ర నాయక్ : చిత్తూరు జిల్లా పీలేరులోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఇతడిని రాంజీ నాయక్ అని కూడా పిలుస్తారు. వృత్తి రీత్యా డ్రైవర్ అయినప్పటికీ ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరించాడు. ఐదేళ్లుగా 20 టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు. ఇతనిపై జిల్లాలో 23 కేసులు ఉన్నాయి.
అబ్దుల్ ఖాదర్‌భాషా : చప్పాని, చప్పు అనే పేర్లతో కూడా పిలవబడే ఇతడు చిత్తూరు నగరంలోని వినాయకపురంలో కాపురం ఉంటున్నాడు. బీకామ్ వరకు చదువుకుని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేశాడు. మూడేళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఉన్నాడు. ఇతనిపై జిల్లాలో 33 కేసులు ఉన్నాయి.
ఇలియాజ్ ఖాన్ : బెంగళూరులోని అడగారకలహళ్లికి చెందిన ఇతడు రెండేళ్లుగా స్మగ్లింగ్ వృత్తిలో ఉన్నాడు. గత ఏడాది జిల్లాకు చెందిన పోలీసులు బెంగళూరులో దాడులు చేయగా, వారిపై దాడులకు సైతం తెగబడ్డాడు. ఇతనిపై 10 కేసులు ఉన్నాయి.