నీళ్ల సాంబారే!
మండిపోతున్న నిత్యావసర సరకుల ధరలు
కూరగాయలు, పప్పులకు దూరం
హాస్టల్ విద్యార్థులకు అందని పోషకాహారం
మార్కెట్లో కూరగాయలు, పప్పుల ధరలు మండిపోతుండడంతో పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు చప్పిడి మొతుకులే పెడుతున్నారు. ధరలు తగ్గితేనేగానీ కూరగాయలతో వంట చేయలేమని నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. దీంతో విద్యార్థులకు నీళ్ల సాంబారే దక్కుతోంది. ఫలితంగా విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం అందటం లేదు.
నర్సీపట్నం : హాస్టళ్లలో విద్యార్థుల భోజనంపై ధరల ప్రభావం కనిపిస్తోంది. జిల్లాలో 48 ఎస్సీ వసతిగృహాల్లో 3,261, బీసీకి చెందిన 68 వసతిగృహాల్లో 6 వేల మంది, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాలు 3,174, ప్రాథమికోన్నత 374, ఉన్నత పాఠశాలులు 509 ఉన్నాయి. ఈ బడుల్లో 6 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వెచ్చిస్తున్నాయి. మధ్యాహ్నం పూట ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో భోజనం అందిజేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం బడులు తెరిచి వారం రోజులు అవుతోంది. ఈ వారం రోజుల్లో నీళ్ల సాంబారు, చప్పిడి మెతుకులతో సరిపెడుతున్నారు. ధరలు ఆదుపులో లేకే ఇలా చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. పప్పుల ధరలూ అలాగే ఉన్నాయని, ఇక వారంలో రెండు రోజులు సాంబారు ఎలా సాధ్యమంటున్నారు.
భయపెడుతున్న ధరలు
పెరిగిన నిత్యావసర ధరలు మధ్యాహ్న భోజన నిర్వాహకులను భయపెడుతున్నాయి. వందల రూపాయలు వెచ్చిస్తున్నా భోజనం పెట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కూరగాయలతో పాటు పప్పుల ధరలు ఆదుపులో లేకపోవడంతో నిర్వాహకులు నానా అవస్థలు పడుతున్నారు. కందిపప్పు కిలో రూ.188 పలుకుతోంది. పెసరపప్పు ధరలు అలాగే ఉన్నాయి. చింతపండు, మిరపకాయల ధరలు పేలుతున్నాయి. ఇవి కాకుండా కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం పచ్చిమిర్చి రూ.50 కాగా టమాటా ధర కిలో రూ.80 పలుకుతోంది. వంకాయలు కిలో రూ.40, బీరకాయలు కిలో రూ.60, బెండ కిలో రూ.40 పలుకుతున్నాయి. వసతిగృహాలు, బడుల్లో నిత్యం వాడే కూరగాయల ధరలు రోజు రోజుకు పెరిగిపోతుండడంతో వీటి ప్రభావం విద్యార్థుల పౌష్టికాహారంపై పడుతోంది. ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న మెనూకు బయట మార్కెట్‌లో ధరలకు పొంతన లేకపోవడంతో వసతిగృహాల సంక్షేమాధికారులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిత్యావసరాలను కొనుగోలు చేయలేక చేతులెత్తేస్తున్నారు. అరకొర నిత్యావసరాలు, కూరగాయలతో సరిపెడుతున్నారు. దీంతో పోషకాహారం అందక విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు.
క్వాలిటీ ఫుడ్ కష్టం
నిత్యావసర సరుకులకు ప్రభుత్వం ఇస్తున్న ధరలకు, బయట మార్కెట్ ధరలకు చాలా వ్యత్యాసం ఉంది. కేజీ కంది పప్పుకు ప్రభుత్వం రూ.140 ఇస్తుంది. బయట మార్కెట్‌లో రూ.188, కిలో టమోటా రూ.100 వరకు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారంలో క్వాలిటీ తగ్గుతుంది. ప్రభుత్వం ఇస్తున్న ధరలతో మార్కెట్‌లో నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనలేని పరిస్థితి. సాధ్యమైనంత వరకు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. ప్రభుత్వం ఆలోచన చేసి మార్కెట్ ధరలకు అనుగుణంగా రేట్లు పెంచితేనే నాణ్యమైన పౌష్టికాహారం అందించడానికి అవకాశం ఉంటుంది.
-ఎం.అప్పారావు, హాస్టల్ సంక్షేమ అధికారి, ఆనందనిలయం, పెదబొడ్డేపల్లి