ముందు హామీలు అమలు చేయండి!
రైతులను మళ్లీమళ్లీ మోసపుచ్చకండి: సీఎంకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి
హైదరాబాద్: రైతుల ప్రయోజనాల కోసమంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటిదాకా ఇచ్చిన ఏ హామీ అమలు చేసి చూపించారని కొత్తగా ‘హరిత’ పథకం ప్రకటిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. సీఎం చంద్రబాబు దయచేసి ఆత్మవంచన చేసుకోకుండా ఆత్మవిమర్శ చేసుకొని పథకాల ప్రకటన చేయాలని పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి హితవు పలికారు. శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఇప్పటికే ఎన్నికల ముందిచ్చిన రైతు రుణాల మాఫీ హామీ అమలు పక్కకు పోయింది.. మేనిఫెస్టోలో ప్రకటించినట్టు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలుకు నోచుకోలేదు.. ఐదు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు ఊసే లేదు.. ఎప్పటికప్పుడు ప్రజలను, రైతులను మోసం చేసే కార్యక్రమాలతో సీఎం ముందుకు సాగుతున్నారు’’ అని దుయ్యబట్టారు.
రైతుల్ని అప్పులపాలుచేశారు..
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతుల రుణాలు రద్దు కాకపోగా, వారు అప్పు కోసం ప్రైవేట్ వ్యాపారుల బారిన పడేలా చేశారని, మొన్నటి వరకు జీరో శాతంతో వడ్డీ రుణాలు పొందిన రైతు నెత్తిన ఇప్పుడు 14 శాతం వడ్డీ భారం పెట్టారని నాగిరెడ్డి దుయ్యబట్టారు. కొత్త రాజధాని ఏర్పాటు కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కావాల్సినంత అటవీ భూమి అందుబాటులో ఉన్నప్పటికీ సన్న, చిన్నకారు రైతులకు చెందిన 30 వేల ఎకరాలు రాజధాని కోసమని బలవంతంగా లాక్కొంటున్నారని విమర్శించారు. తనను చూస్తేనే కరువు పారిపోతుందని బాబు చెప్పుకుంటుంటే ఆయన అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లో పంట తుపానుకు కొట్టుకుపోయిందని, మిగిలిన జిల్లాల్లో కరువు విలయతాండవం చేస్తోందని దుయ్యబట్టారు.