
విజయవాడ రైల్వేస్టేషన్
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమం): విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నాసిరకం ఆహార పదార్ధాలు విక్రయిస్తూ ప్రయాణికులను ఆహార పదా ర్థాల విక్రేతలు నిలువునా దోచుకుంటున్నారు. ముఖ్యంగా దేశంలోనే అత్యంత కీలక జంక్షన్‌లో ఒకటైన విజయవాడ జంక్షన్ మీదుగా నిత్యం 350కి పైగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అన్‌సీజన్‌లో నిత్యం లక్షమంది, సీజన్ లక్షన్నర మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు.
ఇటువంటి కీలక జం క్షన్ నాసిరకం ఆహారపదార్థాలు విక్రయాలతో విక్రేతదారులు ప్రయాణికుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఆహారపదార్థాల త యారీ రైల్వేస్టేషన్‌లో జరగాల్సి ఉన్నా 90 శాతం ఆహార పదార్థాలు బయటినుంచి తయారై స్టేషన్‌లో విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం పదార్థా ల తయారీ మొత్తం రైల్వేస్టేషన్‌లో జరగాల్సి ఉ న్నా అలా జరగటం లేదు. ప్రస్తుతం రైల్వేస్టేషన్‌లో చాలావరకు క్యాంటీన్లు ఐఆర్‌సీటీసీ పరిధి లో ఉన్నాయి. సంబంధిత అధికారులు పదా ర్థాల నాణ్యతను పరిశీలించి విక్రయాలకు అనుమతి ఇవ్వాల్సి ఉన్నా అమలు కావడంలేదు. దీని కి కొంతమంది అధికారులకు నెలవారీ మామూ ళ్లు అందడమేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉద్దేశపూర్వకంగానే ‘జనఆహార్’ ఎత్తివేత
ప్రయాణికులకు అతి తక్కువ ధరకు ఆహార పదార్థాలను విక్రయించేందుకు జన ఆహార్ క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. గత్యంలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే 6వ నెంబరు ప్లాట్‌ఫాంపై ఉండేది. కొంతమంది కాంట్రాక్టర్ల ఒత్తిడి మేరకు దానిని ఎత్తివేశారు. విజయవాడ రైల్వే పరిధిలో జన్ ఆహార్ క్యాంటిన్లను విస్తరించాల్సింది పోయి ఉన్నవాటిని ఎత్తివేశారు.
అధిక ధరల దోపిడీ
స్టేషన్‌లో వాటర్ బాటిళ్లను రూ.15కు విక్రయించాల్సి ఉండగా రూ.20 నుంచి రూ. 25 దాకా విక్రయిస్తున్నారు. అదేవిధంగా 600 ఎంఎల్ కూల్‌డ్రింక్ బాటిళ్లను రూ.40కు విక్రయించాల్సి ఉండగా రూ.50 వసూలు చేస్తున్నారు.
నాసిరకం ఆహార పదార్థాలు
అదేవిధంగా ప్రయాణికులకు విక్రయిస్తున్న బిర్యానీ సైతం నాసిరకం బియ్యంతో తయారు చేయడంతో పాటు ఎటువంటి నాణ్యత పాటించడంలేదు. అదేవిధంగా ఉదయం తయారీ చేసిన బిర్యానీని సాయంత్రం పూట, సాయంత్రం తయారు చేసిన బిర్యానీని ఉదయం విక్రయిస్తున్నారు. ఇవితిన్న ప్రయాణికులు అనారోగ్యం పాలైన సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. అదేవిధంగా నాసిరకం టీని ప్రయాణికులకు సరఫరా చేస్తున్నారు. గతంలో నాసిరకం టీని తీసుకోవడం ద్వారా ప్రయాణికుడు వాంతులు చేసుకొని అస్వస్థతకు గురైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రాత్రిళ్లు నాసిరకం ఆహారపదార్ధాలను అధిక ధరలకు విక్రయిస్తూ ప్రయాణికులను అందిన కాడికి దోచుకుంటున్నారు.
ఐస్‌క్రీముల్లో నాణ్యత డొల్ల
స్టేషన్‌లో ఐస్‌క్రీమ్ విక్రయాలకు అనుమతి లేకపోయినా పెద్దఎత్తున బయటి నుంచి నాసిరకం ఐస్‌క్రీములను స్టేషన్‌లో విక్రయిస్తున్నారు. ఇటీవలి నగరంలో విజిలెన్స్ అధికారులు పెద్దఎత్తున నాసిరకం ఐస్‌క్రీం తయారీదారులపై దాడులు నిర్వహించారు. ఇటువంటి నాసిరకం ఐస్‌క్రీంలనే విజయవాడ రైల్వేస్టేషన్‌లో విక్రయిస్తున్నారు. కొంతమంది అధికారులకు క్యాంటీన్ నిర్వాహుకులు నెలవారీ మాముళ్ల అందుతుండటంతోనే వీటిపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు బలంగా వినపిస్తున్నాయి. అదే విధంగా పదార్థాల విక్రేతల(హాకర్లు)కు ఎప్పటికప్పుడు రైల్వే ఆసుపత్రిలో మెడికల్ పరీక్షలు నిర్వహించి గుర్తింపు కార్డులు జారీ చేయాల్సి ఉన్నా అటువంటి ఏవి అమలు కావడంలేదు. కొంతమంది హాకర్లు నిత్యం మద్యం మత్తులో విక్రయిస్తూ, ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా స్టేషన్‌లో కొంతమందికి మాత్రమే పదార్ధాల విక్రయించడానికి అనుమతి ఉన్నా సంబంధిత కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున నకిలీ కార్డుల ద్వారా పదార్థాల విక్రయాలు జరుపుతున్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.
రైళ్లలో దూరప్రయాణాలు చేసేవారు రైల్వేవారు అందిస్తున్న ఆహారమంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నాణ్యత, శుచిశుభ్రం లేని పదార్థాలు పెడుతుండడం, ఎమ్మార్పీతో సంబంధం లేకుండా అధిక ధరలు వసూలు చేస్తుండడంతో ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కొనుగోలు చేయాల్సివస్తోంది.. విక్రేతల దోపిడీ తెలిసినా మామూళ్ల మత్తులోనే రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
నాసిరకం పదార్థాలు విక్రయిస్తున్నారు
విజయవాడ రైల్వేస్టేషన్‌లో వాటర్ బాటిల్ ధరలు అధికంగా వసూలు చేస్తున్నారు వాటర్ బాటిల్‌ను రూ.20కి విక్రయిస్తున్నారు. అదేవిధంగా స్టేషన్‌లో విక్రయిస్తున్న బిర్యానీ నాణ్యత ఉండటం లేదు. సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.– ఆర్.శ్రీనివాస్, ప్రయాణికుడు
Comments
Please login to add a commentAdd a comment