
పిల్లలకు అన్నం వడ్డిస్తున్న మధ్యాహ్నభోజన కార్మికులు
పేద విద్యార్థికి పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం, శారీరకఎదుగుదల.. పాఠశాలల్లో హాజరు శాతం పెంపు లక్ష్యంతో కేంద్రప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేసింది. అయితే నేడురాష్ట్ర సర్కారు ఆ లక్ష్యం నీరుగార్చుతూ పథకం నిర్వహణనుక్రమ క్రమంగా ప్రైవేటుకు అప్పగిస్తోంది. దీంతో భోజనం నాణ్యతపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.
చిత్తూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనం నిర్వహణ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకుంటోంది. నిన్నటివరకు జిల్లాలోని తిరుపతి పరిధిలో ఇస్కాన్ ట్రస్టుకు బాధ్యతలు అప్పజెప్పారు. ప్రస్తుతం కుప్పం, చిత్తూరు, తదితర ప్రాంతాల్లో మ«ధ్యాహ్నభోజన పథకం నిర్వహణ బాధ్యతలను అక్షయపాత్ర అనే సంస్థకు అప్పగించింది. దీంతో మధ్యాహ్న భోజన పథకంపై ఆధారపడి జీవిస్తున్న 8300 మంది కార్మికులను రోడ్డున పడేసింది.
కార్మికుల ఉపాధికి ఎసరు
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ఉపాధికి ప్రభుత్వం ఎసరు పెడుతోంది. జిల్లాలో మొత్తం 4898 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అందులో 3,41,574 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ పాఠశాలల్లో 8300 మంది వంటకార్మికులు పనిచేస్తున్నారు. ఆ పథకం ప్రారంభంలో ఈ కార్మికులంతా ఎలాంటి పారితోషికం లేకుండానే పనిచేశారు. కార్మిక సంఘాల పోరాటాల ద్వారా 2009 నుంచి వారికి నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవవేతనం ఇస్తున్నారు. అదికూడా ఏడాదిలో 9 నెలలే. అనేక కష్టాలు పడుతూ పనిచేస్తున్న వీరికి చేయూతనివ్వాల్సింది పోయి, ప్రభుత్వం వారి ఉపాధికి ఎసరు పెడుతోంది.
ప్రైవేటు సంస్థతో ఒప్పందం
ఇప్పటివరకు మహిళ సంఘాల ప్రతినిధుల ద్వారా జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను ప్రభుత్వం ప్రైవేటుకు అప్పజెప్పుతోంది. జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని 3, చిత్తూరు నియోజకవర్గంలోని రెండు మండలాల్లో అక్షయపాత్ర అనే సంస్థకు మధ్యాహ్న భోజన పథకం అప్పజెప్పుతున్నారు. ఆ సంస్థకు నాలుగు మండలాలకు దగ్గరలో ఒక చోట భూ కేటాయింపులు జరిపి, అక్కడ వారు వంటషెడ్లను ఏర్పాటు చేసుకునేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆ స్వచ్చంధ సంస్థతో జిల్లా యంత్రాంగం ఒప్పందం సైతం చేసుకుంది.
కార్మికులను తొలగిస్తే ఊరుకోం
పథకం ప్రారంభంలో జీతమివ్వకపోయినా చాలా మంది కార్మికులు సేవా భావంతో పనిచేశారు. ప్ర స్తుతం విద్యార్థికిచ్చే డబ్బులు పెరిగాయి. దీంతో ఇప్పుడు స్వచ్చంధ సంస్థలు ముందుకొస్తున్నాయి. పథకం ప్రారంభం నుం చి కార్మికులు వంట చేస్తున్నారు. వారిని తొలగిస్తే ఊరుకోం. – నాగరాజన్, ఏఐటీయూసీ, జిల్లా గౌరవాధ్యక్షుడు
అగ్రిమెంట్‌ను రద్దు చేయాల్సిందే
ప్రభుత్వం స్వచ్ఛంద సం స్థలకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను అప్ప జెప్పడాన్ని మధ్యాహ్న భోజన కార్మికుల యూని యన్ సంఘం తరఫున వ్యతిరేకిస్తున్నాం. కార్మికులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు. అక్షయపాత్రతో చేసుకున్న అగ్రిమెంట్‌ను వెంటనే రద్దు చేయాలి.– కవిత, మధ్యాహ్న భోజనం వర్కర్స్‌యూనియన్ జిల్లా అధ్యక్షురాలు