ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి
జిల్లాలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదులుతున్నాయి. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నా అరకొర వసతుల మధ్య అద్దె భవనాల్లో కాలేజీలు నడుపుతూ విద్యార్థులను ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. దీంతో ఏపీ ఉన్నత విద్యా మండలి జిల్లాలోని 24 డిగ్రీ కాలేజీలకు నోటీసులిచ్చింది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అద్దె భవనాలు..ఇరుకైన గదులు..ఆట స్థలం లేదు..అసలు కళాశాల వాతావరణమే కనిపించదు. ఫైర్ పర్మిషన్‌నూ ఉండదు. అంతెందుకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఉండాల్సిన ఏ ఒక్కటీ కనిపించదు. జిల్లాలో చాలా వరకు డిగ్రీ కళాశాల తాజా పరిస్థితి ఇది. ఉన్నత విద్యామండలిలో కొందరు అధికారులు మామూళ్లు పుచ్చుకొని పట్టించుకోకపోవడంతో పలు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వసతుల సంగతి పట్టించుకోకుండా విద్యార్థుల వద్ద వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ దండుకుంటున్నాయి. తాజాగా ఏపీ ఉన్నత విద్యామండలి జిల్లాలోని 24 డిగ్రీ కళాశాలలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయా డిగ్రీ కళాశాలల పరిధిలోని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో 8 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 12 ఎయిడెడ్ కళాశాలలుండగా, 112 అన్‌ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలున్నాయి. వీటి పరిధిలో ఏటా 25 వేల మంది పైచిలుకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. నిబంధనల మేరకు డిగ్రీ కళాశాలను అనుమతిచ్చిన ఐదు సంవత్సరాల వరకు అద్దె భవనాల్లో నిర్వహించుకోవచ్చు. ఆ తర్వాత తప్పనిసరిగా సొంత భవనాల్లోనే కళాశాలలు నిర్వహించాలి. విద్యార్థులకు సరిపడా గదులుండాలి. ఆట స్థలం ఉండాలి. ఫైర్ సర్టిఫికెట్, కళాశాలలో పనిచేసే బోధనా సిబ్బంది పీజీ సర్టిఫికెట్స్ తప్పనిసరిగా ఉండాలి. మొత్తంగా 24 రకాల వసతులు కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే డిగ్రీ కళాశాలలు అనుమతులను కొనసాగించాల్సి ఉంది. అయితే చాలా మటుకు కళాశాలలు అద్దె భవనాలు, ఆట స్థలాల్లేని ఇరుకైన గదుల్లో కళాశాలలను కొనసాగిస్తున్నారు. కొందరు రేకుల షెడ్లు, మరికొందరు అపార్టుమెంట్లు తీసుకొని ఎక్కడపడితే అక్కడే కళాశాలలు నిర్వహిస్తున్నారు.
కళాశాలలకు ఆట స్థలం దేవుడెరుగు. విద్యార్థులు తెచ్చుకునే సైకిళ్లు, బైకుల్లాంటి వాహనాల పార్కింగ్‌కు కూడా స్థలాల్లేని కళాశాలలు కోకొల్లలు. ఇక విద్యార్థుల వద్ద వేలకు వేలు ఫీజులు వసూలు చేసి వసతులు, నాణ్యమైన విద్యాబోధన సంగతి గాలికొదిలేశాయి. విధి లేని పరిస్థితుల్లో విద్యార్థులు ఇరుకు గదుల్లోనే విద్యనభ్యసించాల్సి వస్తోంది. అన్ని వసతులతో కళాశాలలుండాలని ఏపీ ఉన్నత విద్యామండలి పలు డిగ్రీ కళాశాలలకు చాలాసార్లు మొక్కుబడిగా నోటీసులు జారీ చేయడం మినహా చర్యలు తీసుకున్న పాపానపోలేదు. దీంతో యాజమాన్యాలు వారిని ఖాతరు చేయడం లేదు. కొందరు ఉన్నతాధికారులకు మామూళ్లు ముట్టజెప్పి యాజమాన్యాలు పని చక్కబెట్టుకుంటున్నాయి.
24 కళాశాలలకు నోటీసులు:
నిబంధనల మేరకు సొంత భవనాల్లో కళాశాలలు ఎందుకు నడపడం లేదంటూ ఏపీ ఉన్నత విద్యామండలి జిల్లాలోని 24 కళాశాలలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న నోటీసులకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఒంగోలు 3 డిగ్రీ కళాశాలలు, సంతనూతలపాడు 1, తర్లుపాడు 1, మార్కాపురం 2, మార్టూరు 1, మేదరమెట్ల 1, దర్శి 2, చీమకుర్తి 1, కంభం 2, గిద్దలూరు 1, కొమరోలు 1, చీరాల 2, పర్చూరు 1, కనిగిరి 1, బేస్తవారిపేట 1, అద్దంకి 1, యర్రగొండపాలెం 1 మొత్తం 24 కళాశాలలకు ఏపీ ఉన్నత విద్యామండలి నోటీసులు జారీ చేసింది. దీంతో ఇప్పుడు పలు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు చిక్కుల్లో పడ్డాయి. ఉన్నత విద్యామండలి చిత్తశుద్ధితో వ్యవహరిస్తే పలు డిగ్రీ కళాశాలలపై చర్యలు తప్పని పరిస్థితి. అదే జరిగితే తమ పరిస్థితి ఏమిటని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి డిగ్రీ కళాశాలలు నిబంధనల మేరకు సొంత భవనాలు తప్పనిసరిగా చూపించాల్సి ఉంది. అలా కాకుండా అద్దె భవనాల్లో అక్రమంగా కళాశాలలు నిర్వహించటంతోనే చివరికి ఈ పరిస్థితి తలెత్తింది.
ఆన్‌లైన్‌తో తిప్పలు
ఉన్నత విద్యామండలి డిగ్రీ కళాశాలల వివరాలను ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఏపీ శామ్స్‌తో అనుసంధానమైన ఉన్నత విద్యామండలి మొత్తం వివరాలను ఈ నెల 5 నుంచి ఆన్‌లైన్ చేయడం ప్రారంభించారు. దీని ప్రకారం డిగ్రీ కళాశాలలకు సంబంధించిన కళాశాల డాక్యుమెంట్స్‌తో పాటు భవనం, గదుల వివరాలను ఆన్‌లైన్ చేయాల్సి ఉంది. గదులకు సంబంధించి పంచాయతీరాజ్ లేదా రోడ్లు, భవనాల శాఖ పరిధిలోని ఇంజినీర్లతో సర్టిఫై చేయించి సర్టిఫికెట్ ఆన్‌లైన్‌లో పెట్టాలి. గ్రౌండ్ వివరాలతో పాటు బోధనా సిబ్బంది పీజీ సర్టిఫికెట్లను సైతం ఆన్‌లైన్‌లో పెట్టాలి. ఫైర్ సర్టిఫికెట్ చూపించాలి. మొత్తంగా 24 కాలమ్స్ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. అనంతరం యూనివర్సిటీ పరిధిలోని కమీషన్ ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేస్తుంది. ఆ తర్వాత సర్టిఫికెట్ జారీ చేస్తుంది. అన్నీ సక్రమంగా ఉంటేనే కళాశాలలకు అనుమతులు లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment