
విమానాశ్రయం ఎదురుగా నిర్మించిన శివగంగమ్మ గుడి
తలదాచుకోవడానికి గూడులేని పేదలు తమకింత జాగా కావాలని కోరితే ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ స్పందించలేదు. అసలు వారి మొర వినేనాథులే లేరు. ‘పల్లె సార్’ చెప్పాడంటూ కొందరు రూ.లక్షలు విలువ చేసే ప్రభుత్వ భూముల్లో పాగా వేస్తున్నారు. మొదట గుడి.. ఆ తర్వాత అక్కడే నివాసం.. సకల సౌకర్యాల కోసం మరికొంత స్థలం కబ్జా చేసేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు.
అనంతపురం, పుట్టపర్తి అర్బన్: ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. ఇటీవల శిల్పారామం కాలనీలో అక్క మహాదేవతల ఆలయాన్ని ప్రారంభించారు. కాలనీలోని అనేకమంది నిరుపేదలు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని పదేళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. అయినా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ అయిన పల్లె రఘునాథరెడ్డి గానీ, అధికారులు గానీ తమను పట్టించుకోలేదని ఆవేదన చెందుతున్నారు. ఎక్కడో నల్లమాడ మండలానికి చెందిన ఓ వ్యక్తి కాలనీలో పది సెంట్లకు పైగా ప్రభుత్వ స్థలాన్ని చదును చేసి అక్క మహాదేవతల గుడి నిర్మించాడు. దాన్ని ప్రారంభించిన తర్వాత.. పక్కనే నివాసానికని, మరుగుదొడ్లు, స్విమ్మింగ్‌పూల్ లాంటి తొట్టె తదితర సదుపాయాల పేరిట స్థలం ఆక్రమించుకున్నాడు. కొంతమంది నాయకులు చందాలు కూడా ఇవ్వడంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి పూనుకున్నాడు. శిల్పారామం కాలనీ ఏర్పాటు సమయంలో అక్కడ వాటర్ ట్యాంకు, పాఠశాల ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటువంటి స్థలంలోనే ఆలయం నిర్మాణానికి పూనుకున్నపుడు స్థానికులు అడ్డు చెప్పినా ‘ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి. ఇది ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి సారే చెప్పారు’ అంటూ బెదిరించినట్లు వాపోతున్నారు.
విలువైన భూమిని ఆయనకు కట్టబెట్టడంతో అక్కడ శివగంగమ్మ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం చుట్టూ పది సెంట్ల భూమిని చదును చేసి పెట్టారు. అమ్మ ఆదేశించి, దాతలు స్పందిస్తే ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీడుపల్లికి చెందిన నారప్ప పేర్కొంటున్నాడు.
మనోళ్లే వదిలేయ్..!
విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అ«ధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ‘వాళ్లు మనవాళ్లే.. వదిలేయి’ అని అంటున్నట్లు సమాచారం.
ఎవరికీ అనుమతులు లేవు
ఈ విషయంపై తహసీల్దార్ సత్యనారాయణను వివరణ కోరగా గుళ్ల నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు గానీ, పట్టాలు గానీ ఇవ్వలేదన్నారు. సిబ్బందిని పంపి విచారణ చేయిస్తానన్నారు. అక్రమ నిర్మాణాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
♦ సత్యసాయి విమానాశ్రయం ఎదుట çసర్వే నంబర్ 666–3ఏలో దాదాపు 2.50 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇందులో వారం క్రితం మరో గుడిని నిర్మించారు. పుట్టపర్తి నగర పంచాయతీలోని బీడుపల్లికి చెందిన ఓ టీడీపీ సానుభూతి పరుడు నాలుగేళ్లు ఎక్కడో మఠంలో ఉండి నెలక్రితం వచ్చి ఎమ్మెల్యేను, నాయకులను అడిగిందే తడవుగా విమానాశ్రయం వద్ద స్థలం కేటాయించారని స్థానికులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment