ప్రభుత్వ పథకాలను పొందడానికి, ఉద్యోగాలకు, స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్టులు.. ఇలా సేవలకు ఆధార్‌కార్డే ఆధారంగా మారింది. జిల్లాలో గతంలో చేసిన ప్రజాసాధికార సర్వేలో ఆధార్ అప్‌డేట్ చేయకపోవడం వల్ల సమస్యలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం రేషన్‌కార్డు పొందాలన్నా, మార్చుకోవాలన్నా, రేషన్ సరుకులు పొందాలన్నా ఆధార్ అనుసంధానం తప్పనిసరి అయ్యింది. ప్రజలు తమ కుటుంబంలోని సభ్యుల ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవడానికి వారం రోజులుగా ముప్పుతిప్పలు పడుతున్నారు. ఆధార్ అనుమతి ఉన్న మీ–సేవ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండితిప్పలు మాని బారులు తీరుతున్నారు. ఈ సమస్య జిల్లాలో ప్రస్తుతం అధికంగా కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.
సాక్షి, చిత్తూరు : ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోంది. నవరత్నాల నినాదంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు సంక్షేమ పథకాలను తెరపైకి తెచ్చారు. ఆ పథకాలు దక్కాలంటే ప్రజాసాధికార సర్వే చేయించుకోవాల్సిందే. గత సర్కారు చేసిన ప్రజాసాధికార సర్వేలో జరిగిన లోపాల వల్ల ప్రస్తుతం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఇంటింటికి వెళ్లి సర్వే చేసిన బృందం నిర్లక్ష్యంగా ప్రజాసాధికార సర్వే చేయడం వల్ల చాలామంది పేర్లు అప్‌డేట్ కాలేదు. ప్రభుత్వ పథకాలను పొందాలంటే ముఖ్యంగా రేషన్‌కార్డు ఉండి తీరాల్సిందే. ఆ రేషన్‌కార్డు ఆధార్‌తో అనుసంధానం కాకపోతే ప్రభుత్వ పథకాలకు అనర్హలవుతారు. దీంతో జిల్లాలోని ప్రజలు తమ పేర్లను అనుసంధానం చేసుకోవడానికి ఆధార్ సెంటర్ల వద్ద క్యూ కడుతున్నారు.
జిల్లా యంత్రాంగం ఫెయిల్
ఆధార్ అనుసంధానం చేసుకోవాలంటే అనుమతి ఉన్న మీ–సేవ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసులకెళ్లి సేవలు పొందవచ్చు. అయి తే జిల్లాలో అలాంటి పరిస్థితులు కనబడడం లేదు. బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ప్రజలకు ఆధార్ అనుసంధాన సేవలు అందించకపోవడంతో ప్రజలు మీ–సేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నిత్యం ఆధార్ సేవలు అందించాలని నిబంధనలు చెబుతున్నాయి. వారు పట్టించుకోకపోవడం వల్ల జిల్లాలో ఆధార్ అనుసంధాన ప్రక్రియ సమస్య రోజురోజుకు తీవ్రతరమవుతోంది. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టడంలో విఫలమైందని ఆరోపణలున్నాయి. బ్యాంకు, పోస్టాఫీసు, మీ–సేవ, ఆధార్ కేంద్రాల ప్రతినిధులతో జిల్లా ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించి ప్రత్యామ్నాయ చర్యలు చేయాల్సి ఉన్నా, అలా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో పరికరాలు నిల్
ఆధార్ అనుసంధానం కోసం జిల్లాలోని తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాలకు, రేషన్ షాపులకు ప్రజలు వెళుతున్నారు. అయితే అక్కడ ఆధార్ అనుసంధానానికి తగిన పరికరాలు లేకపోవడంతో ప్రజలను మీ–సేవ కేంద్రాలకు వెళ్లండని పంపేస్తున్నారు. సర్వర్ స్లో, చిన్నపిల్లలకు, వృద్ధులకు వేలిముద్రలు పడకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఆ సమస్యకు ప్రత్యామ్నాయ సేవలు అందించా లంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఐరిష్ యంత్రాలు తప్పనిసరి. జిల్లాలోని తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో ఐరిష్ యంత్రాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. రేషన్‌షాపుల్లో ఐరిష్ యంత్రాలున్నా అవి పనిచేయడం లేదు.
అవగాహన లోపంతో అవస్థలు
ఆధార్ అనుసంధానం చేసుకోవాలంటే ప్రభుత్వ, మీ–సేవ కేంద్రాలే కాదు.. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కూడా సంప్రదించవచ్చు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో వారు నానా అవస్థలు పడుతున్నారు. తిరుపతి అర్బన్ పరిధిలో తిరుపతి నార్త్ చీఫ్ పోస్ట్‌మాస్టర్, ఎస్వీ యూనివర్శిటీ వద్ద ఉన్న చీఫ్ పోస్టుమాస్టర్, తిరుపతి హెడ్ పోస్టాఫీసు, తిరుపతిలోని ఎన్‌సీపీ కాలనీలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ ఈఎస్‌డీ, ఎస్వీ యూనివర్శిటీ రోడ్డులో డైరెక్టరేట్ ఆఫ్ ఈఎస్‌డీ, బైరాగ పట్టెడలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ ఈఎస్‌డీ, బాలాజీ కాలనీలోని ఆంధ్రాబ్యాంకు, శ్రీదేవి కాంప్లెక్స్ వద్దనున్న ఆంధ్రాబ్యాంకు, ఖాదీ కాలనీలోని ఆంధ్రాబ్యాంకు తదితర చోట్ల ఆధార్ అనుసంధాన సేవలు పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment