హైరానా
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :వాహనాలకు విధిగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ ఉండాలన్న సర్కారు నిర్ణయం గుబులు రేపుతోంది. ఆ తరహా నంబర్ ప్లేట్లను ఉపయోగించాలని సుప్రీం కోర్టు ఏనాడో ఆదేశించింది. ఎట్టకేలకు ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్త వాహనాలకు హై సెక్యూరిటీ ప్లేట్లనుఅమర్చే కార్యక్రమాన్ని ఈనెల 11నుంచే అమలు చేయాలని రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్న పాత వాహనాలకూ 2015 డిసెంబర్‌లోగా వీటిని ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వీటిని అమర్చుకోవాలంటే జిల్లాలోని వాహనాల యజమానులు సుమారు రూ.13 కోట్లను ఖర్చు చేయక తప్పని పరిస్థితి తలెత్తింది. మరోవైపు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు మన రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారనే వివాదం చెలరేగుతోంది. పరిస్థితులు ఎలా ఉన్నా ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి విధివిధానాలు జారీ కాకపోవడంతో జిల్లా రవాణా శాఖ అధికారులు దీనిపై పెద్దగా దృష్టి సారించలేదు.
పాత విధానంలో లొసుగులెన్నో...
పాత విధానంలో నంబర్ ప్లేట్లు వినియోగించే విషయంలో లోపాలు ఉన్నాయి. వ్యక్తిగత అవసరాలకు వినియోగించే వాహనాలకు తెలుపురంగు ప్లేట్లపై నలుపు రంగుతో నంబర్లు వేయూల్సి ఉంది. ప్రైవేటు వాహనాలకు పసుపు రంగు ప్లేటుపై నలుపు రంగుతో నంబర్లు వేయాలి. కానీ.. ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ద్విచక్ర వాహనాలు, కార్లకు సంబంధించి నంబర్‌ప్లేట్ల వినియోగంలో నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు. ప్లేట్లపై సినీ హీరోలు, వ్యక్తిగత చిత్రాలు ముద్రిస్తున్నారు. నంబర్లను ఆంగ్ల అక్షరాల్లో వేస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి. సున్నాతో మొదలయ్యే నంబర్‌లో సున్నాను వాడటం లేదు. ఈ పరిస్థితి వల్లప్రమాదాలు, అసాం ఘిక ఘటనలు జరిగితే వాహన యజమానుల గుర్తింపు కష్టతరంగా మారుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు వినియోగించాలని నిర్ణయించారు.
కొత్త బాదుడు
కొత్త నంబర్ ప్లేట్ల ఏర్పాటు చేసుకోవాల్సి రావడం వల్ల వాహన యజమానులకు చేతి చమురు వదిలించుకోక తప్పని పరిస్థితి. దీనివల్ల జిల్లాలోని వాహన యజమానులపై సుమారు రూ.13 కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉండగా, ఈ మొత్తంలో ద్విచక్ర వాహన యజమానులే సింహభాగం. జిల్లాలో 4 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వీటికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు అమర్చాలంటే రూ.9.36 కోట్ల మేర భారం పడుతుంది. ఆటోల వంటి మూడు చక్రా వాహనాలు 50వేలకు పైగా ఉన్నాయి. వాటి యజమానులు రూ.1.19 కోట్లు, కారు వంటి లైట్ మోటార్ వాహనాలు 24వేలు ఉండగా, వాటిపై రూ.1.26 కోట్ల మేర భారం పడనుంది. వాణిజ్య, భారీ, ట్రాలర్ వాహనాలు 23 వేల వరకూ ఉన్నాయి. వీటిపై సుమారు రూ.1.26 కోట్ల మేర భారం పడే అవకాశాలు ఉన్నాయి. కొత్త విధానంలో ఒక మిల్లీమీటర్ మందం గల హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ను వాహనానికి ముందు, వెనుక అమర్చుకోవాల్సి ఉంటుంది. దీనిని అల్యూమినియంతో తయారు చేస్తారు. దీనిపై నీలి రంగులో హాలోగ్రామ్ ముద్రించి ఉంటుంది.
ప్రతి ప్లేటుపై ఏడు అంకెలతో కూడిన లేజర్ కోడ్‌తోపాటు, తొలగించేందుకు వీలులేనివిధంగా స్నాప్ లాక్ ఉంటుంది. నంబర్‌ను మార్చేందుకు, ఇతర నంబర్ వేసేందుకు, పగులగొట్టేందుకు వీలుండదు. రవాణా శాఖ కార్యాలయంలోనే దీనిని అమర్చేలా చర్యలు తీసుకుంటారు.