
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యా విధానంలో ఉత్తమ ప్రమాణాలు, భారీ సంస్కరణలు, మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానటరింగ్ కమిషన్ పని చేస్తుందని కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో అత్యున్నత ప్రమాణాలు పెంచడంతో పాటు, ఉపాధ్యాయులకు శిక్షణలిచ్చి విద్యాబోధనలో నైపుణ్యం సాధించే విధంగా కృషి చేస్తామన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనలో భాగంగా ఈ నెల 14 నుండి మొదటి విడతలో ప్రతి మండలంలో 15 పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పేద బడుగు వర్గాల పిల్లల చదువు కోసం ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం అమలు చేయనుందని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో తప్పనిసరిగా 25 శాతం సీట్లు బలహీన వర్గాల విద్యార్థులకు కేటాయించి ఉచిత విద్య అందించనున్నామని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు కమిషన్ కు జ్యుడీషియల్ అధికారాలు వున్నాయని వెల్లడించారు.