రస్తుతం పట్టణ భూ గరిష్ట పరిమితి(యూఎల్‌సీ)లో న్యాయాధికారిగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లును జిల్లా డీఆర్‌వోగా నియమిస్తూ..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎట్టకేలకు జిల్లా రెవిన్యూ అధికారి నియామకం జరిగింది. ప్రస్తుతం పట్టణ భూ గరిష్ట పరిమితి(యూఎల్‌సీ)లో న్యాయాధికారిగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లును జిల్లా డీఆర్‌వోగా నియమిస్తూ సోమవారం రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బీ.ఆర్.మీనా ఉత్తర్వులు జారీచేశారు. ఉత్తర్వులు వెలువడిన రోజే ఆగమేఘాల మీద ఆయన పదవీబాధ్యతలు స్వీకరించడం ఉద్యోగవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అనంతపురం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు గతంలో తహశీల్దారుగా కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో పనిచేశారు. డిప్యూటీ కలెక్టర్ హోదాలో కుత్భుల్లాపూర్ మండల తహశీల్దారుగా, జగిత్యాల, మార్కాపురం ఆర్డీవోగా పనిచేశారు. కాగా జిల్లా రెవెన్యూ అధికారి నియామకం వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన అధికారిని డీఆర్‌వోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని తప్పుబడుతున్న తెలంగాణ ఉద్యోగసంఘాలు ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించాయి. ఈనేపథ్యంలో ఆయన వెంటనే విధుల్లో చేరినట్లు తెలుస్తోంది.