
కన్నకొడుకే చంపుతానంటున్నాడు..
పట్నంబజారు (గుంటూరు) : ఆస్తి కోసం కన్న వారినే చంపుతానంటున్న ఓ కఠినాత్ముడిపై సోమవారం రూరల్ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాలాలా ఉన్నాయి. అమృతలూరు మండలం ఇంటూరు గ్రామానికి చెందిన కట్టుపల్లి దేవపాల్ పంచాయతీ కార్యాలయంలో వాచ్‌మెన్‌గా పని చేస్తుంటారు. ఆయన భార్య చంద్రలీల ఇంట్లోనే ఉంటారు. అయితే కుమారుడు మణికిరణ్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి తల్లితండ్రులను మానసికంగా వేధించ టం ప్రారంభించాడు. భార్య పద్మ సైతం వదలి వెళ్ళిపోవటంతో మణికుమార్‌కు ఉన్న ఇద్దరు సంతానాన్ని దేవపాల్ దంపతులే సాకుతున్నారు. మనవరాలు శృతి 7వ తరగతి చదువుతుండగా.. మనవడు సుజిగ్ 5వ తరగతి చదువుతున్నాడు.
అయితే మద్యానికి బానిసగా మారి చెడు స్నేహాలు చేస్తూ.. ఉన్న 5 సెంట్ల స్థలాన్ని అమ్మి డబ్బులు ఇవ్వాలని వేధింపులకు పాల్పడుతున్నాడని దేవపాల్ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. స్థలాన్ని పిల్లల పేరున రాసేస్తామంటే తమను చితకబాదుతున్నాడని వాపోయారు.
స్థలాన్ని నమ్ముకుని ఉన్న తమ పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదన్నారు. స్థలాన్ని ఇవ్వకపోతే చంపుతానని బెదిరిస్తున్నాడని భయాందోళనలు వ్యక్తం చేశారు. గతంలో అమృతలూరు ఎస్సైకి ఫిర్యాదు చేయగా ఏ మాత్రం పట్టించుకోలేదని, జెడ్పీలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కనబడలేదన్నారు. కుమారుడు తమ ఇబ్బందులకు గురి చేయకుండా చూడాలని కోరారు.