
ప్రకృతి ప్రేమికుడు
సాక్షి, కడప : ‘చెట్లను కాపాడండి..ప్రకృతి మనల్ని కాపాడుతుంది’.. ‘ప్రకృతికి అనుకూలంగా నడుచుకుంటే ఆరోగ్యం.. వ్యతిరేకంగా వెళితే అనారోగ్యం’..‘ప్రకృతికి సేవ చేస్తే భగవంతునికి చేసినటే’్ల....ఇవన్నీ ఉపాధ్యాయుడు వెంకట్రామిరెడ్డి చెప్పే మాటలు.. చెట్లను పెంచితే భవిష్యత్తులో ఎలాంటి కష్టముండదని పలువురికి వివరిస్తూ ఉచితంగా మొక్కలను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
వెంకట్రామిరెడ్డి స్వగ్రామం లింగాల మండలంలోని బోనాల. ప్రస్తుతం ఈయన పులివెందుల మండలం వి.కొత్తపల్లె పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న సంకల్పం ఆయనలో కలిగింది. పర్యావరణాన్ని కాపాడటంతోపాటు వర్షాలు కురవాలన్నా... ఎవరూ చేయలేని మేలు చేసేది చెట్టేనని బాగా నమ్మిన వ్యక్తి. దీంతో ప్రజలకు ఉచితంగా మొక్కలను అందించి ప్రకృతిని కాపాడటంలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు.
ఉచితంగా 30 వేలకు పైగా మొక్కలు అందజేత
పులివెందులలోని పార్నపల్లె రోడ్డులో ఉన్న సరస్వతీ విద్యామందిరం పాఠశాల ఆవరణంలో వెంకట్రామిరెడ్డి సొంతంగా నర్సరీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు కూలీల సాయంతో మొక్కలకు సంబంధించిన విత్తనాన్ని నాటే కార్యక్రమంలో నిమగ్నమవుతారు. సమీప ప్రాంతాల నుంచి రేగడి మట్టిని తెప్పించుకుని కవర్లలో నింపడం, అందులో విత్తనం వేయడం, కూలీలతో నీళ్లు పట్టించడంలాంటి పనులు చేస్తూనే పాఠశాలకు హాజరవుతూ వస్తుంటారు.
2011లో మొదలు పెట్టిన ఈ యజ్ఞం ఇప్పటివరకు నిరంతరాయంగా కొనసాగుతునే ఉంది. ఎవరు వచ్చి అడిగినా లేదనకుండా ఉచితంగా మొక్కలు అందజేస్తారు. ఇలా ఇప్పటికి దాదాపు 30 వేల మొక్కలు అందజేశారు. కవర్లు, విత్తనం, మట్టి, నీరు పట్టడం వంటి ఇతర ఖర్చులు కలుపుకుని ఒక్కొక్క మొక్కకు రూ. 10 వరకు ఖర్చు వస్తుంది.
ఔషధ మొక్కల పెంపకం
భవిష్యత్తులో ఉపయోగపడాలన్న సంకల్పంతో ఔషధ మొక్కలను ప్రత్యేకంగా పెంచి ప్రజలకు అందిస్తున్నారు. ఈ మొక్కలు ఎక్కడైనా... ఎలాంటి ప్రదేశంలోనైనా బతుకుతాయి. వేప, కానుగ, ఉసిరి, చింత, పాలిక, బూడిద, గన్నేరు, నేరేడు, బండి గురివింద, పాణికాయ, మారెడు, తెల్లమద్ది, పనస, బాదం, ఎర్రచందనం, మోదుగ, గమ్మడి టేకు, సుంకేసుల, సింధూరం వంటి అనేక రకాల మొక్కలను వెంకట్రామిరెడ్డి ఉచితంగా అందిస్తున్నారు. ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క రకం ఉపయోగం ఉంటుందని వెంకట్రామిరెడ్డి చెబుతుంటారు. వీరపునాయునిపల్లెకు చెందిన ద్వారకనాథరెడ్డి ద్వారా కొండజాతి ఔషధ, అడవి జాతికి చెందిన విత్తనాలను తెప్పించుకుంటారు.
పర్యావరణం కోసమే! - వెంకట్రామిరెడ్డి
ఎన్నో రకాల విత్తనాలు సేకరించి.... అన్ని మొక్కలు పెంచుతున్నా... ప్రజల్లో మార్పు రావాలి. జీవ వైవిద్యం, పర్యావరణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడితేనే భవిష్యత్తు ఉంటుంది. మొక్కలు పెంచడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి ఇంటిలో ఏదో ఒక రూపంలో రేడియేషన్ పెరుగుతోంది. పర్యావరణాన్ని కాపాడాలంటే మొక్కల పెంపకమే ఏకైక మార్గం.