ఒంగోలులో రెండో కేంద్రీయ విద్యాలయం!
ఒంగోలు వన్‌టౌన్ : కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలను ఒంగోలులో నెలకొల్పడంపై ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు ైవె వీ సుబ్బారెడ్డి దృష్టి సారించారు. ఒంగోలుకు రెండో కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించేందుకు ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. రెండో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు జిల్లా కలెక్టర్‌తో చర్చించి ఒక కొలిక్కి తెచ్చారు. కేంద్రీయ విద్యాలయ సమితి(కేవీఎస్) ఆధ్వర్యంలో ఇప్పటికే ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో కేంద్రీయ విద్యాలయాన్ని నిర్వహిస్తున్నారు.
ఒంగోలులో కేంద్రీయ విద్యాలయం సీట్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఒంగోలులో రెండో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు ప్రిన్సిపాల్ చెల్లి ప్రసాదరావు ప్రతిపాదించారు. వాటి ఆధారంగా ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రెండో కేంద్రీయ విద్యాలయంను మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నారు. కలెక్టర్‌తో మాట్లాడి విద్యాలయ నిర్వహణకు అవసరమైన 20 గదులను ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల సముదాయం(ఓల్డ్ రిమ్స్)లో కేటాయింపజేశారు.
రెండో కేంద్రీయ విద్యాలయం మంజూరు చేస్తే కొత్త భవనాల నిర్మాణం కోసం స్థానిక మంగమూరు రోడ్డులోని ఆశ్రమం సమీపంలో 4.38 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయింపజేశారు. ఈ మేరకు అన్ని వివరాలతో రెండో కేంద్రీయ విద్యాలయం మంజూరుకు జిల్లా కలెక్టర్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ ద్వారా ప్రతిపాదనలు పంపారు. వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో కేవీఎస్ కార్యదర్శి, కమిషనర్‌ను కలిసి ఒంగోలుకు రెండో కేంద్రీయ విద్యాలయం అవసరాన్ని వివరించారు.
ఒంగోలులో ప్రస్తుతం నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయానికి స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 5 ఎకరాల స్థలం కేటాయించారు. ఈ స్థలంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో నూతన భవనాల నిర్మాణం చేపట్టారు. ఈ పాఠశాలలకు అనుబంధంగా విద్యార్థులకు హాస్టల్ మంజూరు చేయించేందుకు ఎంపీ ప్రయత్నిస్తున్నారు. కాగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మార్కాపురం, గిద్దలూరులో కూడా కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించాలని ఆయా ప్రాంతాల వాసులు డిమాండ్ చేస్తున్నారు.