సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు వైద్య కళాశాలల తీరుపై హైకోర్టును ఆశ్రయించిన పలు విద్యార్థులకు చుక్కెదురైంది. పలు కళాశాలలు తమ దరఖాస్తులను స్వీకరించటం లేదని, కొన్ని కాలేజీలు తమ పేర్లను మెరిట్ జాబితాలో ప్రచురించలేదంటూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు.. ఆ ఆరోపణలకు ఆధారాలు లేవంటూ సోమవారం కొట్టివేసింది. ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద ప్రవేశాలు కోరుతున్న పలువురు విద్యార్థులు.. ఆయా కాలేజీలు తమ దరఖాస్తులను స్వీకరించలేదని, ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వలేదని, తమ పేర్లను మెరిట్ జాబితాలో ప్రచురించలేదని, పెద్ద మొత్తంలో డొనేషన్లు చెల్లించిన వారికే సీట్లు ఇచ్చి మెరిట్‌కు పాతర వేశారని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
వీటన్నింటిపై వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ అశుతోష్‌మెహంతా, జస్టిస్ దామా శేషాద్రినాయుడులతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ఆయా కాలేజీలపై ఆరోపణలు చేసిన విద్యార్థులు అందుకు సంబంధించి పూర్తి ఆధారాలను కోర్టు ముందుంచటంలో విఫలమయ్యారంటూ పిటిషన్లను కొట్టివేసింది. కాలేజీలు తమను అడ్డుకున్నాయన్న విద్యార్థులు, అలా అడ్డుకున్న వారిపై పోలీసు ఫిర్యాదు ఇవ్వకపోవటం, కాలేజీల తీరుపై యూనివర్సిటీకి వినతిపత్రం సమర్పించకపోవటం తదితర అంశాలను తన తీర్పులో ప్రస్తావించింది.
అయితే వచ్చే ఏడాది నుంచైనా ప్రవేశాలను పారదర్శకంగా జరపాలన్న ధర్మాసనం.. అందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దరఖాస్తులన్నీ ఏకరూపంగా ఉండేటట్లు చూడటంతో పాటు అటు కాలేజీలు, ఇటు విశ్వవిద్యాలయం కేంద్రాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎన్‌టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ప్రవేశం కోరుతున్న విద్యార్థిని ఆయా కాలేజీలు ఇంటర్వ్యూ చేసే సమయంలో యూనివర్సిటీ అధికారులు గానీ విద్యాశాఖ అధికారులు గానీ అక్కడ ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.
ఆరోపణలకు ఆధారాల్లేవ్
Published Tue, Oct 1 2013 12:43 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM
Advertisement
Advertisement