
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆయన ఏసీబీ డీజీగా ఉన్న కాలంలో తమపై అక్రమ కేసులు నమోదు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పదమూడు జిల్లాల నుంచి తరలివచ్చిన బాధితులు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం సమీపంలో ఆందోళన చేపట్టారు. మాజీ సీఎం చంద్రబాబు మెప్పు కోసం తమపై ఠాకూర్ అక్రమ కేసులు బనాయించారంటూ ఫ్లెక్సీలతో ప్రదర్శన నిర్వహించారు. గత ప్రభుత్వ పాలనలో టీడీపీ నేతలకు సహకరించలేదని ఠాగూర్ తమపై పెట్టిన తప్పుడు కేసులపై రివ్యూ చేయాలని వారు కోరారు. టీడీపీకి తొత్తుగా వ్యవహరించి వందలాది కుటుంబాలను ఇబ్బంది పెట్టిన ఠాకూర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఠాకూర్ అక్రమాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని బాధితులు పేర్కొన్నారు. ఏసీబీలో ఇప్పటికీ చంద్రబాబు, ఠాకూర్ మునుషులే అజమాయిషీ చెలాయిస్తున్నారని ఆరోపించారు. అందువల్లే తమపై పెట్టిన కేసులు పరిష్కారం కావటం లేదని అన్నారు. తొమ్మిదేళ్లుగా ఏసీబీలో బదిలీలు లేవని.. వెంటనే బదిలీలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment