న్యూఢిల్లీ: చేనేతపై వస్తు సేవల పన్ను(జీఎస్టీ) విధించడాన్ని నిరసిస్తూ ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో చేనేత సంఘం ప్రతినిధులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంగళవారం దీక్ష వహించారు. జీఎస్టీ అమలులో కేంద్ర ప్రభుత్వం చేనేతకు మినహాయింపు ఇవ్వాలని వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ తూతిక విశ్వనాథ్ కోరారు. చేనేతపై పన్ను విధించాలన్న నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
చేనేతపై పన్ను వల్ల ఏపీలో ఈ రంగంపై రూ.40 కోట్ల ఆర్థిక భారం పడుతుందన్నారు. దీనివల్ల ప్రత్యక్షంగా 3 లక్షలు, పరోక్షంగా 8 లక్షల మంది కార్మికుల జీవితాలపై ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదరణ లేక చేనేత కార్మికులు వృత్తి వదిలి అసంఘటిత రంగానికి వలస వెళ్తున్నారన్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు కెకె.సంజీవరావు, నక్కలమిట్ట శ్రీనివాసులు, రాజాపంతుల నాగేశ్వరరావు, బుట్టా రంగయ్య, వెంకట సాయినా«థ్ తదితరులు పాల్గొన్నారు.