ప్రభుత్వ పునాదులు కదలాలి
5న ధర్నాకు వైఎస్‌ఆర్ సీపీ పిలుపు
అనంతపురం అర్బన్ : మోస పూరిత హామీలతో అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబునాయుడుని ప్రజలు విశ్వసించడం లేదని, ప్రభుత్వం పునాదులు కదిలేలా డిసెంబర్ 5న కలెక్టరేట్ వద్ద తలపెట్టినా మహాధర్నాను విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్ సీపీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ మాట్లాడుతూ... అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ప్రజా సంక్షేమానికి చంద్రబాబు నాయుడు తిలోదకాలిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రుణమాఫీ పేరుతో అన్ని వర్గాల ప్రజలను వంచనకు గురి చేశారని అన్నారు. మహాధర్నాకు పెద్ద ఎత్తున బాధితులు తరలివచ్చేలా క్షేత్ర స్థాయిలో ముమ్మర ప్రచారం చేయాలని సూచించారు. డిసెంబర్ 1న ప్రతి మండల కేంద్రంలోనూ సమీక్ష సమావేశాలు నిర్వహించి మహాధర్నాపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. బైక్ ర్యాలీలు విృస్తతంగా చేపట్టలన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న టీడీపీ ప్రభుత్వం మెడలు వంచాల్సిన తరుణమిదేనని ఆ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు.
జిల్లాలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, ఇలాంటి తరుణంలో రుణమాఫీ అందకపోవడంతో మరింత అప్పుల ఊబిలో అన్నదాతలు కూరుకుపోయారని అన్నారు. వేధింపులు తాళలేక జిల్లా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాక ముందు టీడీపీ ఇచ్చిన మోసపూరిత హామీలపై క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు బి.గురునాథరెడ్డి అన్నారు.
జిల్లాలో ఇప్పటికే 50 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. మహాధర్నా అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి సూచించారు. ఈ ప్రభుత్వానికి రైతాంగంపై కనికరం లేదని మండిపడ్డారు. బాబు ఇచ్చిన హామీల వల్ల జిల్లాలో 75 శాతం డ్వాక్రా మహిళలు డిఫాల్టర్లుగా ముద్రించబడ్డారని తెలిపారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మహా ధర్నాకు తరలి రావాలని పిలుపునిచ్చారు.
అనంతరం మహాధర్నాకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ లింగాల శివశంకరరెడ్డి, నియోకవర్గాల సమన్వయ కర్తలు నవీన్ నిశ్చల్, కె.సోమశేఖరరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రరెడ్డి, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ృష్ణవేణి, ట్రేడ్ యూనియన్ జిల్లా అబ్జర్వర్ కె.హుసేన్‌పీరా, మైనారిటీ సెల్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కెప్టన్ షెక్షా, మైనారిటీ నాయకులు నదీమ్ అహమ్మద్, గౌస్‌బేగ్, బోరంపల్లి ఆంజనేయులు, సీపీ వీరన్న, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మిద్దె భాస్కర్‌రెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి, మరుట్ల మారుతినాయుడు, బండి పరుశురాం, చింతా సోమశేఖర్‌రెడ్డి, మారుతిప్రసాద్, ప్రకాష్‌రెడ్డి, పీరా, కసునూరు రఘునాథరెడ్డి, చింతకుంట మధు కనేకల్లు రామలింగారెడ్డి, వెన్నపూస రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.