సమైక్యమే రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరం: కావూరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే దేశానికి, రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరమని కేంద్రమంత్రి, ఏలూరు లోక్సభ సభ్యుడు కావూరి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. ఏలూరులో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర విభజనపై అవసరమైతే ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని ఆయన స్ఫష్టం చేశారు.
రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ జులై 30న తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. 2009 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్ర ప్రకటన తొందరపాటు చర్య అని తాను కేంద్రానికి ముందే చెప్పానని కావూరి సాంబశివరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అయితే కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు సొంత నియోజకవర్గమైన ఏలూరులో మంగళవారం సమైక్య సెగ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరుకు వస్తున్న కావూరిని కలపర్రు చెక్పోస్ట్ వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. దాంతో కావూరి తన ఎస్కార్ట్ వాహనంలో బయలుదేరి ఏలూరు నగరాన్ని చేరుకున్నారు.